Jordan Yellow Gas Leak: విషవాయువు లీక్‌.. 12 మంది మృతి, 199 మందికి అస్వస్థత

28 Jun, 2022 09:38 IST|Sakshi

విషపూరిత వాయువు లీకేజీ ఘటనలో 12 మంది చనిపోయారు. మరో 251 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన జోర్డాన్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జోర్డాన్‌ దక్షిణ ఓడరేవు నగరమైన అకాబాలో క్లోరిన్‌ గ్యాస్‌ లీకేజీ అయ్యింది. జిబౌటికి ఎగుమతి చేస్తున్న 25 టన్నుల క్లోరిన్‌ గ్యాస్‌తో నిండిన ట్యాంకర్లను షిప్పుల్లో ఎక్కించే సమయంలో ప్రమాదం జరిగింది. 

క్లోరిన్‌ గ్యాస్‌ ఉన్న ట్యాంకర్‌ ప్రమాదవశాత్తు కిందిపడిపోవడంలో భారీ పేలుడు సంభవించింది. పసుపు రంగు క్లోరిన్‌ విష వాయువు ఆ ప్రాంతంలో విస్తరించింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 251 మంది గాయపడ్డారని ప్రభుత్వ ప్రతినిధి ఫైసల్‌ అల్‌ షాబౌల్‌ వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 199 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు.

ఇదిలా ఉండగా.. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విష వాయువు వ్యాప్తి చెందిన నేపథ్యంలో ఓడరేవుకు ఉత్తరాన 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న అకాబా నగర ప్రజలు మాస్కులు ధరించి ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. కిటికీలు, తలుపులు మూసివేసుకోవాలని హెచ్చరించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. 

ఇది కూడా చదవండి: అమెరికాలో విషాదం.. 42 మంది మృతి

మరిన్ని వార్తలు