ఇరాన్‌లో​ హిజాబ్‌ హీట్‌.. పాలకుల్లో ఫుల్‌ టెన్షన్‌!

28 Sep, 2022 20:41 IST|Sakshi

ఆడోళ్లు పిడికిళ్లు బిగించడంతో ఇరాన్ భగ్గుమంటోంది. హిజాబ్ సరిగ్గా ధరించలేదని ఓ  అమ్మాయిని అరెస్ట్ చేసిన పోలీసులు కస్టడీలో చిత్రహింసలకు గురి చేసి చంపేశారని ఆరోపిస్తూ  మహిళలు వీధులకెక్కి ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలోనే హిజాబ్‌లను తీసి నడివీధిలో దగ్ధం చేశారు. పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. హిజాబ్ అనేది తమ కల్చర్ కానే కాదని అది కేవలం మహిళలను కల్చర్ ముసుగులో అణచివేసే ఒత్తిడి మాత్రమేనని వారు దుయ్యబడుతున్నారు.

ఇరాన్‌లో  కొనసాగుతోన్న ఈ ఉద్యమానికి పలు ప్రపంచ దేశాల్లో ప్రజల నుండి సంఘీభావం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వంపైనా తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. పోలీసుల తీరుకు.. పాలకుల వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఈ మంటలు పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తెలీని భయం పాలకులను కంగారు పెడుతోంది. గత ఏడాదో అంతకు ముందో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటిన వేళ ఇరాన్ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి ఉద్యమించారు. ఆ తర్వాత ఇంతగా జనం బయటకు వచ్చి ఆందోళనలకు దిగిన సంఘటనలు ఒక్కటి కూడా లేవు. ఇపుడు ఈ ఉద్యమం రోజు రోజుకీ తీవ్రతరం అవుతోంది. ఇప్పటికే ఈ ఆందోళనలో పోలీసుల తూటాలకు లాఠీ దెబ్బలకు చాలా మంది తలలు వాల్చేశారు. ఆందోళన కారుల తిరుగుబాటు దాడిలో ఒకరిద్దరు భద్రతా సిబ్బంది కూడా చనిపోయారు. మొత్తం మీద అటూ ఇటూ కలిసి ఇప్పటివరకు 75 మందికి పైనే మరణించి ఉంటారని ప్రాధమిక అంచనా. 

కాకపోతే చైనా తరహాలోనే ఇరాన్ లో కూడా  ఉద్యమాల సమయంలో మరణించే వారి సంఖ్య బయటకు రాదు. ప్రభుత్వాలు అంత గట్టిగా ఉక్కుపాదానికి పని చెబుతారు. అంతటి  కఠిన నిబంధనల చట్రంలోనూ 75 మంచి చనిపోయారన్న  వార్త బయటకు వచ్చిందంటే వాస్తవంగా ఈ లెక్క ఎన్ని రెట్లు  ఎక్కువగా ఉంటుందో ఊహించడానికే భయమేస్తుందంటున్నారు మేథావులు.

అసలింతకీ ఇరాన్‌లో మహిళలు ఎందుకిలా  వీధుల్లోకి వచ్చి  ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందో తెలుసుకోవాలి ముందు. మహసా అమిని అనే 22 ఏళ్ల అమ్మాయి కుటుంబ సభ్యులతో కలిసి టెహ్రాన్ కు వచ్చింది. ఆమెను  మోరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె చేసిన తప్పేంటంటే  హిజాబ్ ను సరిగ్గా ధరించకపోవడమే. ఇరాన్ లో ప్రతీ మహిళ హిజాబ్ ను ధరించాలి. అది అక్కడి డ్రెస్ కోడ్. ఆ హిజాబ్ ను కూడా ఒక పద్ధతి ప్రకారం ధరించాలి. ఎలాగంటే అలా తలకి చుట్టేయకూడదు. ఈ నిబంధనలను మహిళలు అమలు చేస్తున్నారా లేదా అన్నది పర్యవేక్షించేందుకే మోరల్ పోలీసు విభాగాన్ని ప్రత్యేకించి ఏర్పాటు చేశారు. మహాసా అమిని హిజాబ్ ను సరిగ్గా కట్టుకోలేదని గమనించిన మోరల్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి  పోలీస్ స్టేషన్ కు తరలించిన తర్వాత అత్యంత దారుణంగా హింసించారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించినా లాభం లేకపోయింది . సెప్టెంబరు 16న అమిని చనిపోయింది.

అమిని మరణ వార్త క్షణాల్లో దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాలో అధికారులను తిట్టిపోసిన జనం ఈ విషయంలో ప్రభుత్వానికి గట్టి  అల్టిమేటం ఇవ్వాల్సిందేనని నిర్ణయించారు. గంటల్లోనే అమిని హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా మహిళలు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. మహిళలు తమ పోనీ టెయిల్ జుట్టును కత్తిరించుకున్నారు.  ఆ వీడియోలను  సోషల్ మీడియాలో ఉంచి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇది ఇరాన్ అంతటా వ్యాపించేసింది. అక్కడితో ఆగలేదిది. ఇరుగు పొరుగు దేశాలకూ విస్తరించింది. ప్రతీ దేశంలోనూ ఇరాన్ మహిళల ఉద్యమానికి మద్దతుగా మహిళలు యువకులు కూడా బయటకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.

టర్కీలో నివసించే ఇరాన్ యువతి నసీబే  ఇరాన్ కాన్సులేట్ ఎదురుగా  నిరసన ప్రదర్శనలో పాల్గొని అందులోనే తన పోనీ టెయిల్ ను కత్తిరించుకుంది. ఈ ఆందోళనల్లో చనిపోయిన ఓ యువకుడి మృతదేహాన్ని ముందు పెట్టుకుని కుటుంబ సభ్యులు రోదిస్తోన్న సమయంలో అతని సోదరి తన జుట్టు కత్తిరించి సోదరుని మృతదేహంపై పెట్టి నిరసన వ్యక్తం చేసింది.

అసలు హిజాబ్ సంస్కృతి ఎలా మొదలైందో కూడా తెలసుకోవాలి..
1979  ప్రాంతంలో ఇరాన్ అగ్రనేత అయతొల్లా ఖొమైనీ  దేశంలో మహిళలంతా విధిగా హిజాబ్ ధరించి తీరాలని ఆదేశించారు. దాంతో వేలాది మంది వీధుల్లోకి వచ్చి దాన్ని వ్యతిరేకించారు. ఆ  ఉద్యమ సెగకు కంగారుపడిన పాలకులు అబ్బే అదేమీ ఆంక్ష కాదు కేవలం ఆయన సిఫారసు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కారు. ఆ తర్వాత దేశంలో విప్లవం వచ్చింది. దాని తర్వాత 1983 నుండి హిజాబ్ ధారణతో పాటు మహిళల వస్త్రధారణకు సంబంధించి ఒక డ్రెస్ కోడ్ ను  ప్రకటించారు. అప్పటి నుండి హిజాబ్ ను ధరించడమే కాదు దాన్ని చట్టంలో చెప్పిన విధంగానే ధరించాలన్న ఆంక్ష అమలవుతూ వస్తోంది.

1979కి ముందు దేశాన్ని పాలించిన లౌకిక పాలకుడు మహమ్మద్ రెజా పహలావి హయాంలో హిజాబ్ ధరించాలన్న ఆంక్షలు లేవు కానీ.. చాలా మంది మహిళలు స్వచ్ఛందంగా హిజాబ్ ధరించేవారు. దానికి రకరకాల కారణాలున్నాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకైతేనేం ఓ సంప్రదాయంగా భావించడం వల్లనైతేనేం తమ మతానికి సంబంధించిన ఓ చిహ్నంగా గౌరవించడం వల్లనైతేనే మహిళలు తమంతట తాము ధరించేవారు. అయితే 1983కి ముందు వరకు ఎవరైనా హిజాబ్ ధరించకపోయినా అది నేరమేమీ కాదు. ఎలాంటి శిక్షలూ ఉండేవి కావు. ఎవరూ ఒత్తిడి చేసేవారు కూడా కాదు. కానీ ఎప్పుడైతే అది ఒక చట్టమై కూర్చుందో అప్పటినుంచే సమస్య మొదలైంది. దాన్ని కఠినంగా అమలు చేసే క్రమంలో మోరల్ పోలీసులు మరీ  కఠినంగా వ్యవహరించడంతో మహిళల్లో హిజాబ్ పట్ల ఒకరకమైన వ్యతిరేకత వస్తోందని ప్రముఖ ఇరాన్ జర్నలిస్ట్, కవి అమిని అంటున్నారు. హిజాబ్ ధరించకపోతే అరెస్టులు చేసి జైళ్లకు పంపిస్తారన్న భయమే మహిళల్లో హిజాబ్ పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యిందని  మేథావులు అంటున్నారు.

హిజాబ్‌ను అడ్డుపెట్టుకుని మహిళలను అణచివేస్తున్నారన్న భావన రావడంతోనే హిజాబ్ ను అణచివేతకు ఓ సింబల్ గా భావిస్తున్నారు మహిళలు. ప్రస్తుతం ఇరాన్ ను అట్టుడికిస్తోన్న ఉద్యమం కేవలం హిజాబ్ కు వ్యతిరేకంగా మాత్రమే కాదంటున్నారు ఇరాన్ మహిళలు." మాకు స్వేచ్ఛ కావాలి. మాకు ప్రజాస్వామ్యం కావాలి. సంప్రదాయాలు సంస్కృతుల ముసుగులో మమ్మల్ని అణచివేసే  నిరంకుశ పోకడలు పూర్తిగా పోవాలి మా బతుకులు మేం ప్రశాంతంగా బతికే వీలు ఉండాలి" అని మహిళా సంఘాల నేతలు అంటున్నారు.

ఇరాన్‌లో రకరకాల జాతులు, తెగల వాళ్లు జీవిస్తున్నారు. వాళ్లల్లో ఒక్కో తెగ ఒక్కో రకమైన వస్త్ర ధారణ చేస్తారు. అది వారి సంప్రదాయం. హిజాబ్‌ను కూడా ఒక్కో తెగ ఒక్కో విధంగా కట్టుకుంటారు. అది కూడా వారి సంస్కృతి. పాలకుల ఆంక్షలు మాత్రం అందరూ ఒకేలా హిజాబ్ కట్టాలి. ఇష్టం వచ్చినట్లు హిజాబ్ ను కట్టుకుంటే  అరెస్ట్ చేసి జైలుకు పంపేస్తారు. ఈ  తలా తోకా లేని పాలకుల విధానాలే  వివిధ తెగలు జాతుల స్వేచ్ఛను  మంటకలుపుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇరాన్‌లో పర్షియన్లు, కుర్దులు, అజర్ బైజానీయులు, గిలాకీలు, అరబ్బులు, బలూచ్‌లు, టర్క్ మెన్లతో పాటు మరికొన్ని జాతులు నివసిస్తున్నాయి. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో జీవనశైలి. ఒక్కొక్కరిదీ ఒక్కో సంప్రదాయం. ఒక్కో సంస్కృతి. అందరినీ ఒకే గాటన కట్టేసి మీరు ఇలాగే చేయండని ఆంక్షలు విధించడమంటే వారి జీవించే స్వేచ్ఛను అణచివేయడమే అవుతుందంటున్నారు హక్కుల నేతలు. ప్రజలకు నచ్చని పనులు చేసి తీరాలని ఆంక్షలు విధించడం హక్కులను హరించడం కిందే లెక్క అంటున్నారు మహిళలు. ఇరాన్ పాలకులు రకరకాల ఆలోచనలతో చేస్తున్నది అదే అంటున్నారు వారు.

తల నుంచి  పాదాల వరకు మొత్తం శరీరాన్ని కప్పి ఉంచే నల్లటి బట్టను ధరించాలని ప్రభుత్వం ఓ విధానాన్ని ప్రతిపాదించింది. వ్యవస్థలో మార్పు రావాలన్న కసి అందరిలోనూ ఉంది. అందుకే హిజాబ్ అనేది కేవలం మహిళల సమస్యగా చూడ్డంలేదు ఇరానియన్లు. మహిళలతో పాటు  పురుషులు కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా వీధుల్లోకి వచ్చి పాలకుల తీరును ఎండగడుతున్నారు. దేశంలోని మొత్తం 31 ప్రావిన్సులు, 80కి పైగా నగరాల్లో ఉద్యమం ఉధృత రూపంలో కొనసాగుతోంది. జనజీవితాలు స్తంభించాయి.
ఈ ఉద్యమ విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోక తప్పదంటున్నారు ఇరాన్ అధినేత ఎబ్రహీం రైజీ. దేశ సమగ్రత అంతర్గత భద్రతలకు ముప్పు వాటిల్లేలా ఎవరు వ్యవహరించినా చూస్తూ ఊరుకునే ప్రసక్తి ఉండనే ఉండదని ఆయన హెచ్చరిస్తున్నారు. దానర్ధం ఉద్యమం ఎంత ఉధృతం అయినా అణచివేసి తీరతాం అనా? అని మేధావులు నిలదీస్తున్నారు.

ఆందోళనలే అయితే  ఫరవాలేదు. ఇవి ఆందోళనల్లా కనపడ్డం లేదు. అంతకు మించి తీవ్రమైన లక్ష్యాలేవో ఉన్నాయని అనిపిస్తోంది అని రైజీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ కు చెందిన ప్రముఖ సినీ దర్శకుడు ఆస్కార్ అవార్డ్ విజేత అస్ఘర్ ఫర్హాదీ అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులంతా కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. అమిని హత్యోదంతం యావత్ ప్రపంచం సిగ్గుతో తలదించుకోవలసిన ఘటన అని అస్ఘర్ అభివర్ణించారు.

యునైటెడ్ కింగ్ డమ్, ఫ్రాన్స్, జర్మనీ తదితర యూరప్ దేశాల్లోని ఇరానియన్లు ఈ ఉద్యమానికి మద్దతుగా ఆయా దేశాల్లో ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అంతర్జాతీయ సమాజం అంతా ఇరాన్ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతోంది. ఇది ఇరాన్ ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగానే ఉంది. అలాగని ఇప్పటికిప్పుడు హిజాబ్ తప్పనిసరి కాదు అని ఎలాంటి ప్రకటన చేసే పరిస్థితులూ లేవు.  అమెరికా ఆంక్షలతో ఆర్ధికంగా చితికిపోయి ఉన్న ఇరాన్‌కు హిజాబ్‌ ఉద్యమం పెద్ద తలనొప్పిగానే పరిణమిస్తోంది. ఏదో ఒకటి చేయకపోతే సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉందంటున్నారు మేథావులు.

ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ముస్లిం మహిళలే పోరాడారు. సతీసహగమనానికి వ్యతిరేకంగా హిందువులే ఉద్యమించారు. అదే వేరే మతాల నుంచి ఒత్తడి వస్తే ఆ సమస్యలు ఎప్పటికీ అలానే ఉండేవి కావచ్చు. అందుకే  ఆంక్షలు విధించడం అనేది  పాలకులకు, వ్యవస్థలకు ఏ మాత్రం మంచిది కాదంటున్నారు మేథావులు. అది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టని వారంటున్నారు. అందరికీ స్వేచ్ఛనిచ్చే మంచి సమాజాన్ని ఆవిష్కరించడమే ప్రభుత్వాల విధానం కావాలని వారు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు