రోబోలొచ్చేస్తున్నాయ్‌.. జాగ్రత్త

6 May, 2022 03:17 IST|Sakshi

రోబోల రాకతో.. ఇప్పటికే ఉద్యోగాల విషయంలో మనకు గడ్డు కాలం మొదలైంది.. భవిష్యత్తులో అది మరింత పెరగనుందనడానికి సూచిక ఈ చిత్రం. ఇది లండన్‌లోని ఓ భారీ గోదాము.. ఇక్కడ మనుషులకు బదులు రోబో కాదు.. రోబోల సైన్యమే ఉంది. సుమారు 35 సూపర్‌ మార్కెట్లకు సమానమైన ఈ గోడౌన్‌లో సుశిక్షితులైన సిబ్బంది చేసే దానికన్నా ఐదురెట్ల వేగంతో ఇవి పనికానిచ్చేస్తున్నాయి.

ఇంతకీ ఏం చేస్తున్నాయి.. 
బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత ఆన్‌లైన్‌ గ్రాసరీ వెబ్‌సైట్‌ ఒకాడో తమ వినియోగదారులకు వీలైనంత త్వరగా సరుకులను సిద్ధం చేసేందుకు నూతన పంథాను ఎంచుకుంది. లండన్‌లో 5,63,000 చదరపు అడుగుల్లో ఉన్న తమ గోదాములో సుమారు 50 వేల రకాల వస్తువులను... ఆర్డర్లు అందిన వెంటనే డెలివరీ బాయ్స్‌కు అందించేందుకు వీలుగా 2 వేలకుపైగా రోబోలను వినియోగిస్తోంది.

8 చక్రాలతో పరుగులు తీసే ఈ రోబోలు తేనెతుట్టె గదులను పోలినట్లుగా ఉండే నిలువాటి పెట్టెల్లో అమర్చిన స్టాక్‌ను క్షణాల్లో సేకరించేస్తున్నాయి. తమకున్న ‘చేతుల’తో వస్తువులను అందుకొని వాటిని నిలువాటి గొట్టంలో వేయడం ద్వారా పికప్‌ స్టేషన్‌లోని సిబ్బంది వద్దకు పంపుతున్నాయి. ఈ రోబోలు 20 గంటలపాటు నిర్విరామంగా పనిచేస్తూ ఒక షిఫ్టులో ఏకంగా 20 లక్షల ఆహార వస్తువులను పెట్టెల్లోంచి తీసుకెళ్తున్నాయి. ఏ పెట్టెలో ఏమేం వస్తువులు ఉన్నాయో తెలుసుకోవడంతోపాటు.. పక్కదాన్ని ఢీకొనకుండా ఎలా వెళ్లాలో ముందే సిద్ధం చేసిన కంప్యూటర్‌ అల్గోరిథమ్‌ ద్వారా బాట్స్‌ అని పిలిచే ఈ రోబోలు మొత్తం ప్రక్రియను పూర్తిచేస్తున్నాయి. ఈ రోబో సైన్యం వల్ల వేలాది మంది సిబ్బంది అవసరం, ఖర్చు తగ్గిందని ఒకాడో తెలిపింది. 
– సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌  

మరిన్ని వార్తలు