ఐదేళ్లలో అంతరిక్ష నగరాలు!?

31 Jan, 2021 15:10 IST|Sakshi

సౌర కుటుంబంలో కుజుడు (మార్స్‌), జూపిటర్‌ (గురు) మధ్య ఉండే ఆస్ట్రాయిడ్‌ బెల్ట్‌లోని వేలాది గ్రహ శకలాలు పరిభ్రమిస్తుంటాయని తెలిసిన సంగతే! ఈ బెల్టులోని పెద్ద పెద్ద శకలాల చుట్టూ సమీప భవిష్యత్‌ లో మానవ ఆవాసాలు (హ్యూమన్‌ సెటిల్‌మెంట్స్‌) సాధ్యమేనని ఫిన్లాండ్‌ సైంటిస్టు డా. పెక్కా జాన్‌హ్యునన్‌ చెబుతున్నారు. అది కూడా ఎప్పుడో కాదని, వచ్చే నాలుగైదేళ్లలో 2026 నాటికి హ్యూమన్‌ కాలనీలు ఏర్పడతాయంటున్నారు. వచ్చే 15 సంవత్సరాల్లో లక్షలాది మంది ఈ మెగాసిటీలో నివాసం ఉండేందుకు తరలిపోతారంటున్నారు. ఈ మేరకు ఆయన ‘మెగా శాటిలైట్‌’ పేరిట ఒక రిసెర్చ్‌ పేపర్‌ను పబ్లిష్‌ చేశారు. ఈ బెల్టులోని అతిపెద్ద గ్రహ శకలం సీరిస్‌ చుట్టూ పరిభ్రమించేలా శాటిలైట్‌ నగరాలు నిర్మించవచ్చని చెప్పారు.

సీరిస్‌ గ్రహం భూమి నుంచి 32.5కోట్ల మైళ్ల దూరంలో ఉంది. ఆర్టిఫిషియల్‌ గ్రావిటీతో ఈ శాటిలైట్‌ కాలనీలు ఏర్పాటు చేయవచ్చని జాన్‌ చెప్పారు. ఇప్పటివరకు అంతరిక్షంలో మానవ సెటిల్‌మెంట్‌ ఆలోచనలన్నీ చంద్రుడు, కుజుడు, టైటాన్‌ చుట్టూనే తిరిగాయి. తొలిసారి జాన్‌ విభిన్న సిద్ధాంతం ప్రతిపాదిస్తున్నార ప్రతిపాదిత శాటిలైట్‌ సిటీ డిస్క్‌ ఆకారంలో ఉంటుందని, వేలాది స్థూపాకార నిర్మాణాలు ఇందులో ఉంటాయని, ఒక్కో నిర్మాణంలో 50 వేల మంది నివసించవచ్చని చెప్పారు. వీటిని శక్తిమంతమైన అయిస్కాంతాలకు లింక్‌ చేయడం వల్ల కృత్రిమ గ్రావిటీని సృష్టించి వీటిని స్థిరంగా ఉంచవచ్చన్నారు. 15 సంవత్సరాల తర్వాత ఈ కాలనీల్లో ప్రజలు సీరిస్‌పై వనరులు తవ్వడం ఆరంభించవచ్చని అంచనా వేశారు. సీరిస్‌ నుంచి శాటిలైట్‌ నగరానికి వచ్చేందుకు స్పేస్‌ ఎలివేటర్లు ఉంటాయన్నారు. సీరిస్‌పై వాతావరణంలో నైట్రోజన్‌ ఎక్కువని, అందువల్ల భూమి వాతావరణానికి దగ్గనడి ఉంటుందని చెప్పారు. ఇన్ని చెబుతూ, ఇలా ఏర్పరిచే కృత్రిమ నగరాలకు ఆస్ట్రాయిడ్స్‌ నుంచి, స్పేస్‌ రేడియేషన్‌ నుంచి ముప్పు పొంచి ఉంటుందని తేల్చేశారు. ఈ ముప్పులను తట్టుకునేందుకు శాటిలైట్‌ సిటీల చుట్టూ స్థూపాకార అద్దాలు ఏర్పరచాలని సూచించారు. ఇవన్నీ వింటుంటే సైన్స్‌ ఫిక్షన్‌ కథలా ఉంది కదా! కానీ జాన్‌ ప్రతిపాదన మాత్రం అంతరిక్షంలో మానవ ఆవాసాల ఏర్పాటుపై కొత్త కోణాన్ని చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు.  

మరిన్ని వార్తలు