హద్దు మీరితే ప్రకృతి శిక్షే.. ఏడాదికి 560 విపత్తులు!

27 Apr, 2022 03:24 IST|Sakshi

  2030 నుంచి తప్పవు 

ఐరాస నివేదిక హెచ్చరిక

మనిషి హద్దు మీరితే ప్రకృతి శిక్షిస్తుంది.. పురాణకాలం నుంచీ వింటూనే ఉన్నా మానవ ప్రవర్తన మారడంలేదు, ప్రకృతి విధ్వంసం ఆపడం లేదు. పర్యావరణంపై మనిషి అకృత్యాలు మితిమీరిపోతున్నాయని, ఇలాగే కొనసాగితే ప్రకృతి విలయతాండవాన్ని చవిచూడాల్సివస్తుందని తాజాగా ఐరాస నివేదిక హెచ్చరిస్తోంది.  ప్రస్తుత ధోరణులే కొనసాగితే 2030నుంచి ఏడాదికి 560 విపత్తులను మానవాళి చవిచూడాల్సివస్తుందని నివేదిక తెలిపింది. 2015లో అత్యధికంగా 400 విపత్తులు ఎదురైతేనే మనిషి అల్లకల్లోలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఏడాదికి 560 అంటే రోజుకు దాదాపు ఒకటిన్నర విపత్తు ఏదోరూపంలో మనిషిని ఇబ్బందిపెట్టనుందన్నమాట! వరదలు, తుపానులు, భూకంపాలు, కొత్త వ్యాధులు, రసాయన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు.. ఇలా అనేక రూపాల్లో ఇవి ఎదురవుతాయి. 1970– 2000 సంవత్సరం వరకు ప్రపంచంలో ఏదోఒక చోట ఏడాదికి 90– 100 వరకు విపత్తులు వచ్చేవని, కానీ పర్యావరణ విధ్వంసం వేగవంతం కావడంతో విపత్తుల వేగం కూడా పెరిగిందని నివేదిక తెలిపింది. 

మూడురెట్ల వేడి 
2030లో ప్రపంచాన్ని వేడిగాలులు చుట్టుముడతాయని, వీటి తీవ్రత 2001 కన్నా మూడురెట్లు అధికంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. అదేవిధంగా కరువులు 30 శాతం మేర పెరుగుతాయని తెలిపింది. కేవలం ప్రకృతి విధ్వంసాలు మాత్రమే కాకుండా ఆర్థిక మాంద్యాలు, వ్యాధులు, ఆహారకొరతలాంటివి కూడా శీతోష్ణస్థితి మార్పుతో సంభవిస్తాయని హెచ్చరించింది.  ఇప్పటికైనా మేల్కోకపోతే తగిన మూల్యం చెల్లించాల్సిఉంటుందని ఐరాస ప్రతినిధి మమి మిజుటోరి చెప్పారు. 1990ల్లో విపత్తుల కారణంగా సంవత్సరానికి దాదాపు 7వేల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని, ఇప్పుడీ నష్టం 17వేల కోట్ల డాలర్లకు పెరిగిందని చెప్పారు. విపత్తుల ప్రభావం ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఉంటుందని ఐరాస డిఫ్యూటీ సెక్రటరీ జనరల్‌ అమినా చెప్పారు. ప్రదేశాలవారీగా ఆసియాపసిఫిక్‌  ప్రాంతంలో విపత్తుల వల్ల ఏడాదికి జీడీపీలో 1.6 శాతం మేర నష్టపోతుందని తెలిపారు.     – నేషనల్‌ డెస్క్, సాక్షి.  

మరిన్ని వార్తలు