Hurricane Ian: అమెరికాలో హరికేన్‌ బీభత్సం.. వైరలైన ఫొటోలు, వీడియోలు

30 Sep, 2022 10:48 IST|Sakshi
తుపాను ధాటికి ఫ్లోరిడా రాష్ట్రంలోని ఫోర్ట్‌ మేయర్స్‌ సిటీ తీరంలో ధ్వంసమైన పడవలు

ఫ్లోరిడాలో కుండపోత వానలు 

కరెంటు లేక 25 లక్షలమందికి ఇక్కట్లు

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌: అమెరికాలో ఇయన్‌ హరికేన్‌ ప్రతాపానికి ఫ్లోరిడా విలవిలలాడుతోంది. నైరుతి ఫ్లోరిడాలో హరికేన్‌ విధ్వంసం సృష్టిస్తోంది. గంటకి 241 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు నీట మునిగిపోయాయి. వీధుల్లోకి షార్క్‌లు కొట్టుకొస్తున్నాయి. విద్యుత్‌ స్తంభాలు కూలిపోతున్నాయి. వంతెనలు కొట్టుకుపోతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వానలతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 25 లక్షల మంది కరెంట్‌ లేక తీవ్రమైన కష్టాలు పడుతున్నారు.

అమెరికా చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన హరికేన్‌ ఇదేనని నేషనల్‌ హరికేన్‌ సెంటర్‌ వెల్లడించింది. టాంపా, ఒర్లాండో విమానాశ్రయాల్లో విమానాల రాకపోకల్ని నిలిపివేశారు. వందల సంఖ్యలో మృతులు ఫ్లోరిడా కౌంటీ అధికారి ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. సహాయం కోసం తమకు ఆగకుండా ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని చెప్పారు. అయితే కొన్ని కౌంటీలలోకి వెళ్లడానికి వీల్లేని పరిస్థితులున్నాయని తెలిపారు.

ఇళ్లల్లోకి అయిదు అడుగుల మేరకు నీరు వచ్చి చేరినట్టుగా సమాచారం అందుతోందని చెబుతున్నారు. ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోంది. హరికేన్‌ వార్తల్ని కవర్‌ చేస్తున్న విలేకరులు పెనుగాలల ధాటికి నిలువలేక ఒరిగిపోతున్న దృశ్యాలు కలవరపెడుతున్నాయి. విద్యుత్‌ లేకపోవడం, సెల్‌ టవర్లు పనిచెయ్యకపోతూ ఉండడంతో సహాయ చర్యలు అందించడం కత్తి మీద సాములా మారింది. జాతీయ రక్షణ సిబ్బంది దాదాపుగా 5 వేల మందిని సహాయం కోసం ఫ్లోరిడా పంపినట్టుగా రక్షణ శాఖ వెల్లడించింది. హరికేన్‌ విధ్వంసం సృష్టించే ప్రాంతాల్ని తిరిగి పునర్నిర్మిస్తామని అధ్యక్షుడు జో బైడెన్‌ హామీ ఇచ్చారు.   

మరిన్ని వార్తలు