హైనాల స్థావరం.. గుహ నిండా ఎముకలే

30 Jul, 2021 12:59 IST|Sakshi

రియాద్‌ : ఏడు వేల సంవత్సరాల నాటి హైనాల స్థావరాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సౌదీ అరేబియాలోని ఓ లావా గుహలో ఈ  స్థావరాన్ని గుర్తించారు. ఈ గుహ మొత్తం ఎముకలతో నిండి ఉంది. ఈ గుహలో దాదాపు 40 రకాల జంతువుల ఎముకలు బయటపడ్డాయి. వీటిలో మనుషులు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలు, మేకలు, జింకలు, ఇతర హైనాల ఎముకలు సైతం ఉన్నాయి. ఈ గుహ కొన్ని వేల సంవత్సరాల పాటు హైనాలు విందు ఆరగించే ప్రదేశంగా ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. హైనాలు మాంసం కోసం స్మశాన వాటికలలోని మనుషుల మృతదేహాలను గుహలోకి లాక్కువచ్చుంటాయని అభిప్రాయపడుతున్నారు.

2007లో ఈ గుహను కనుగొన్నప్పటికి లోపలినుంచి జంతువుల అరుపులు వినపడ్డంతో పరిశోధకులు లోపలికి వెళ్లేప్రయత్నం చేయలేదు. ఈ గుహనుంచి పరిశోధనల నిమిత్తం 1,917 ఎముకలు, పళ్లను వెలికి తీశారు. వీటిలో 1,073 ఎముకలు అస్థిపంజరానికి చెందినవిగా గుర్తించారు. 13 శాంపిల్స్‌ను రేడియో కార్బన్‌ డేటింగ్‌ టెస్ట్‌ చేయగా వాటిలో కొన్ని ఎముకలు 6,839 ఏళ్ల నాటి వని తేలింది.  హైనాలు ఒకరకంగా చెప్పాలంటే సర్వభక్షకాలు. అయితే, ఎక్కువగా మాంసాహారానికి మొగ్గుచూపుతాయి. ఇతర జంతువుల్ని గుంపుగా వేటాడి, చంపి తింటాయి. ఇతర జంతువులకంటే హైనాల జీర్ణవ్యవస్థ ప్రత్యేకమైనది. జంతువుల అన్ని రకాల ఎముకలను సైతం తిని అరిగించుకోగలవు.

మరిన్ని వార్తలు