తొలిసారి హైపర్‌లూప్‌లో ప్రయాణికులు

9 Nov, 2020 19:12 IST|Sakshi
హైపర్‌లూప్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ జోష్‌ జోజెల్, డైరెక్టర్‌ ఆఫ్‌ ప్యాసింజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ సారా లుచియాన్

వాషింగ్టన్‌ : అమెరికాలోని లాస్‌ వెగాస్‌ నగరంలో రిచర్చ్‌ బ్రాన్సన్‌కు చెందిన వర్జిన్‌ గ్రూప్‌ ఆదివారం నాడు హైపర్‌ లూప్ రైలును(కత్రిమ సొరంగ మార్గం గుండా అతివేగంగా నడిచే రైలు) తొలిసారి ప్రయాణికులతో నడిపి విజయం సాధించింది. గతంలో 400 సార్లు హైపర్‌ లూప్‌ రైలు ట్రయల్స్‌ను నిర్వహించిన ఈ సంస్థ ప్రయాణికులతో నడపడం మాత్రం ఇదే మొదటిసారి. హైపర్‌లూప్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ జోష్‌ జోజెల్, డైరెక్టర్‌ ఆఫ్‌ ప్యాసింజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ సారా లుచియాన్‌ తొలి ప్రయాణికులుగా ప్రయాణించారు. ప్రయాణికులు కూర్చొని వెళ్లే రైలును ప్రస్తుతం సైన్స్‌ పరిభాషలో ‘లెవిటేటింగ్‌ పాడ్‌’ అని, రైలు మార్గాన్ని ట్యూబ్‌ అని వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో దీన్ని ఆంగ్లంలో ‘ట్యూబ్‌ ట్రెయిన్‌’ అని పిలిస్తే తెలుగులో గొట్టం రైలుగా చెప్పుకోవచ్చేమో! ఈ రైలుకు గంటకు 600 మైళ్ల వేగంగా దూసుకెళ్లే సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రయాణికులతో నడపడం తొలిసారి కనుక గంటకు వంద మైళ్ల వేగంతో రైలును నడిపారు. ( కరోనా వ్యాక్సిన్‌ : ఫైజర్‌ పురోగతి )

ఆ రైలు 15 సెకండ్లలో 0.3 మైళ్లు, అంటే 500 మీటర్ల దూరం దూసుకెళ్లింది. అత్యద్భుతమైన హైపర్‌లూప్‌ టెక్నాలజీని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేందుకు తమ  వర్జిన్‌ గ్రూప్‌ విశేషంగా కృషి చేస్తోందని గ్రూప్‌ వ్యవస్థాపకులు పర్‌ రిచర్డ్‌ బ్రాన్సన్‌ తెలిపారు. ఈ సంస్థ నెవడాలోని ఎడారిలో తన హైపర్‌లూప్‌ మార్గాన్ని నిర్మించి గత కొన్నేళ్లుగా ప్రయోగాలు నిర్వహిస్తోంది. హైపర్‌లూప్‌లో గాలిని కూడా తొలగిస్తారు కనుక ఎలాంటి బాహ్య ఒత్తిడి లేకుండా రైలు వేగంగా ప్రయాణిస్తుందన్నది సైద్ధాంతికంశం. ప్రస్తుతం 600 మైళ్ల వేగంతో నడపడమన్నది కంపెనీ లక్ష్యం కాగా, దాన్ని భవిష్యత్తులో గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగం వరకు పెంచవచ్చన్నది భవిష్యత్‌ వ్యూహం.

మరిన్ని వార్తలు