‘చైనా పదే పదే ఇలా ఎందుకు చేస్తుందో చెప్పలేను’

17 Jul, 2022 15:20 IST|Sakshi

Chinese aircraft breached the Indian perceived LAC: భారత్‌-చైనా మధ్య 16వ రౌండ్‌ అత్యున్నత స్థాయి సైనిక చర్చలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఐఏఎఫ్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి మాట్లాడుతూ....వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఏసీ) అంతటా గగనతలంలో వైమానిక దళాలు నిరంతరం పర్యవేక్షిస్తాయని చెప్పారు. ఏదైనా చైనా విమానం భారత గగనతలానికి కొంచెం దగ్గరగా వచ్చినట్లు గుర్తించిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఐతే జూన్‌ చివరి వారంలో ఒక చైనీస్‌ విమానం భారత్‌ వాస్తవ నియంత్రణ రేఖను దాటి కొన్ని నిమిషాలపాటు ఘర్షణ ప్రాంతాల మీదుగా ఎగిరిందని తెలిపారు.

భారత్‌ రాడార్‌ సాయంతో ఆ యుద్ధ విమానాన్ని గుర్తించామని ఆ విమానాన్ని అడ్డుకున్నట్లు కూడా వివరించారు. చైనా విమానాలు వాస్తవ నియంత్రణ రేఖ వద్దకు వచ్చినప్పుడల్లా.. తమ వైమానిక కార్యకలాపాలను అ‍ప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు  తెలిపారు. ఐతే చైనీయుల ఇలా పదేపదే ఎందుకు చేస్తున్నారనే విషయంపై సరైన వివరణను ఇవ్వలేనని చౌదరి అన్నారు. ఈ క్రమంలోనే తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణ ప్రాంతాల్లో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించే రీత్యా ఈ 16వ రౌండ్ అత్యున్నత స్థాయి సైనిక చర్చలు జరుగుతున్నాయి అని చెప్పారు.

ఈ చర్చలు భారత్‌ వాస్తవాధీన రేఖ వైపున ఉన్న చుషుల్ మోల్డో ప్రాంతంలో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యాయని తెలిపారు. గతంలో భారత సైన్యం, చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) మధ్య 15వ రౌండ్‌ చర్చలు మార్చి 11న దాదాపు 13 గంటల పాటు జరిగింది. ఐతే ఈ చర్చలు ఫలించలేదు. ఈ మేరకు ప్రభుత్వం చేపట్టిన అగ్నిపథ్ పథకం గురించి కూడా ఐఎఎఫ్‌ చీఫ్ మాట్లాడారు. దీనికి సంబంధించి దాదాపు 7.5 లక్షల దరఖాస్తులను స్వీకరించామన్నారు. ఇది సాయుధ దళాల్లో చేరేందుకు యువతలో ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది. డిసెంబర్‌లో శిక్షణ ప్రారంభించేలా.. ఎంపిక ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడం ఒక పెద్ద సవాలు అని చెప్పారు. పైగా ఈ ఏడాది ఎయిర్‌ఫోర్స్ డే పరేడ్‌ను చండీగఢ్‌లో నిర్వహించనున్నట్లు చౌదరి తెలిపారు.

(చదవండి: ప్రజలకు తక్షణ ఉపశమన కార్యక్రమాలు అందించాలి)

మరిన్ని వార్తలు