అమెరికాలో మంచు వడగండ్ల వాన

2 Feb, 2023 04:21 IST|Sakshi

వందలాది విమాన సర్వీసులు రద్దు

పాఠశాలలు బంద్‌

రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

ఆస్టిన్‌/న్యూయార్క్‌: అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాల్లో మూడు రోజులుగా అతిశీతల పరిస్థితులు కొనసాగుతున్నాయి. టెక్సాస్‌ మొదలుకొని వెస్ట్‌ వర్జీనియా వరకు భారీగా కురిసిన మంచు వడగండ్ల వానతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మంచు వాన కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు చనిపోయారు. వాహనదారులు రోడ్లపైకి వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఉదయం 1,400 విమాన సర్వీసులు రద్దయ్యాయి. డల్లాస్, ఆస్టిస్, టెక్సాస్, నాష్‌విల్లె, టెన్నెస్సీ విమానాశ్రయాల్లో విమానాలు నిలిచిపోయాయి. ప్రమాదకర అతిశీతల వాతావరణంతో డల్లాస్, మెంఫిస్, టెన్నెస్సీల్లో స్కూళ్లు మూతబడ్డాయి. లక్షలాది మంది విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. అర్కాన్సస్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

న్యూయార్క్‌లో అసాధారణం
న్యూయార్క్‌ వాసులు ఏటా డిసెంబర్‌– జనవరి ఆఖరు వరకు కురిసే మంచులో స్లెడ్జిలపై తిరుగుతూ, స్నోబాల్స్‌తో కొట్లాడుతూ ఎంజాయ్‌ చేసేవారు. కానీ, ఈసారి.. దాదాపు 50 ఏళ్ల తర్వాత అలాంటి పరిస్థితులు కనిపించకుండా పోయాయి. గడిచిన 325 రోజుల్లో నగరంలో ఒక్కసారైనా అరంగుళం మంచు కూడా పడలేదని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 1973 తర్వాత ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం ఇదే మొదటిసారని వాతావరణ శాస్త్రవేత్తలు అన్నారు. వరుసగా 332 రోజులు అతి తక్కువ మంచుకురిసిన 2020 నాటి రికార్డు త్వరలో బద్దలు కానుందని కూడా చెప్పారు. ఏడాదికి సరాసరిన 120 అంగుళాల మంచు కురిసే సిరాక్యూస్‌లో ఈసారి 25 అంగుళాలు మాత్రమే నమోదైంది. రొచెస్టర్, బఫెల్లోలోనూ దాదాపు ఇవే పరిస్థితులున్నాయి.
ఉటాహ్‌లోని వెల్స్‌విల్లెలో
 మంచును తొలగిస్తున్న ఓ వ్యక్తి

మరిన్ని వార్తలు