బైడెన్‌కే జై అంటున్న ప్రీ పోల్స్‌..

3 Nov, 2020 14:38 IST|Sakshi

10 పాయింట్ల ఆధిక్యంలో కొనసాగతున్న బైడెన్‌

స్వింగ్‌ రాష్ట్రాల్లోనూ బైడెన్‌ ముందంజ

ట్రంప్‌కు ప్రతికూలంగా మారిన కోవిడ్‌

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాలన్ని అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల కోసం ఆత్రతుగా ఎదురు చూస్తున్నాయి. మరి కొన్ని గంటల్లో పోలింగ్‌ ప్రారంభం కానుంది. అయితే, ఈసారి ఎన్నికలు ప్రత్యేక పరిస్థితుల మధ్య జరుగుతున్న నేపథ్యంలో ఫలితాల వెల్లడి కొంచెం ఆలస్యం కావొచ్చని నిపుణుల అభిప్రాయం. కరోనా భయంతో అమెరికన్లు ముందస్తు ఓటింగ్‌కే మొగ్గుచూపిన సంగతి తెలిసిందే. మెయిల్ ఇన్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ల ద్వారా మొత్తం 24 కోట్ల మంది రిజిస్టర్ ఓటర్లలో.. సుమారు 10 కోట్ల మంది ముందస్తుగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే... ఇప్పటికే చాలా సర్వేలు రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ ముందంజలో ఉన్నట్లు వెల్లడించాయి. ఇక తాజాగా వెలువడిన సీఎన్ఎన్ పోల్స్ ఫలితాల్లో బైడెన్ ఏకంగా 10(పది శాతం) పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్లు వెల్లడించింది. సీఎన్ఎన్ పోల్స్ ప్రకారం బైడెన్‌కు 52 శాతం, ట్రంప్ 42 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని తెలిసింది.

సర్వేలన్ని బైడెన్‌కే అనుకూలం..
సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్, ఫాక్స్ న్యూస్ పోల్స్‌ కూడా ట్రంప్‌తో పోలిస్తే.. బైడెన్‌ 8 నుంచి 10 పాయింట్ల అధిక్యంలో కొనసాగుతున్నట్లు వెల్లడించాయి. ఫాక్స్ న్యూస్ కూడా బైడెన్‌దే పైచేయి అని తేల్చేయడం గమనార్హం. ఫాక్స్ న్యూస్ సర్వే పోల్స్‌లో బైడెన్ కంటే ట్రంప్ 8 పాయింట్లు వెనుకంజలో ఉన్నట్లు తేలింది. కాగా, 2016 అధ్యక్ష ఎన్నికల పోల్స్ ఫలితాలతో పోలిస్తే ఈసారి బైడెన్‌కు మద్దతు కాస్తా ఎక్కువగా ఉంది. ఇక న్యూయార్క్స్‌ టైమ్స్‌ ప్రకారం ఒకవేళ ప్రీ పోల్స్‌ నిజమైతే.. బైడెన్‌ భారీ విజయం సాధించడం ఖాయం అని స్పష్టం చేసింది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఆగస్టు నెలలో ట్రంప్‌పై డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ 10 పాయింట్ల అధిక్యంలో ఉన్నారు. అయితే, పోలింగ్ డే నవంబర్ 8 కంటే ఒక్కరోజు ముందు అంటే.. నవంబర్ 7న ఆమె అధిక్యత నాలుగు పాయింట్లకు పడిపోయింది. హిల్లరీకి 46 శాతం, ట్రంప్‌కు 42 శాతంగా ఉంది. ఇక వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ న్యూస్ అయితే హిల్లరీ కేవలం 2 పాయింట్ల కంటే కూడా తక్కువ అధిక్యతలో ఉన్నట్లు చెప్పాయి. చివరకు స్వింగ్ రాష్ట్రాల్లో‌ ట్రంప్ విజయం సాధించి అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు. (చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వివాదాలెన్నో!)

ట్రంప్‌కు ప్రతికూలం కానున్న కరోనా
కానీ ఈసారి దీనికి పూర్తి భిన్నంగా బైడెన్ అధిక్యతలో కొనసాగుతున్నారు. పోలింగ్ డే మంగళవారానికి ఒక్కరోజు ముందు సోమవారం వెలువడిన సీఎన్ఎన్ పోల్స్ ఫలితాలలోనూ బైడెన్‌ 10 పాయింట్ల స్పష్టమైన అధిక్యాన్ని ప్రదర్శించడం గమనార్హం. ఇక కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో ట్రంప్‌ విఫలమయ్యారని చాలా మంది అమెరికన్లు భావిస్తున్నారు. ఆ కోణంలో వ్యతిరేక ఓట్లు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్‌ ట్రంప్‌కు ప్రతికూలంగా మారనుంది. 57.2 శాతం మంది అమెరికన్లు ఈ సంక్షోభంపై ట్రంప్ స్పందించిన తీరును తప్పుబడుతున్నారు. 2.30 లక్షల మంది అమెరికన్లు ట్రంప్ నిర్లక్ష్యం కారణంగానే కొవిడ్‌కు బలయ్యారని మండిపడుతున్నారు. (చదవండి: అమెరికాలో మొదలైన ఎన్నికల పోలింగ్)

2016లోను వెనకబడ్డ ట్రంప్‌.. కానీ
ఆగష్టు 2016 లో, హిల్లరీ, డొనాల్డ్ ట్రంప్ కంటే 10 పాయింట్లతో ముందంజలో ఉన్నారు. హిల్లరీకి 49శాతం అనుకూలంగా ఉండగా ట్రంప్‌కు 39శాతం అనుకూలంగా ఉంది. కానీ పోస్ట్‌ కన్వేన్షన్‌ పోల్స్‌ తరువాత పరిస్థితులు మారాయి. ట్రంప్‌ నెమ్మదిగా పుంజుకున్నారు. అలాగే, అమెరికాలో బరాక్ ఒబామా నేతృత్వంలోని డెమోక్రాటిక్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపబ్లికన్ పార్టీ నిలబడటం, అధికార పార్టీ మీద వ్యతిరేకత వంటి అంశాలు ట్రంప్‌కు కలసి వచ్చాయి.అయితే ఈ సంవత్సరం, ట్రంప్ ప్రత్యర్థి బైడెన్ భారీ అధిక్యతతో కొనసాగుతున్నారు. సెప్టెంబరులో, మొదటి అధ్యక్ష చర్చకు ముందు, ఎన్‌బీసీ న్యూస్ పోలింగ్ సగటు ప్రకారం.. బైడెన్, ట్రంప్‌ కన్నా 8 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. మంగళవారం ఎన్నికలకు ఒక రోజు ముందు ఆయన ఈ ఆధిక్యం 12 పాయింట్లకు పెరిగిందని సీఎన్‌ఎస్‌ పోల్‌ తెలిపింది. (చదవండి: వైరల్‌.. ఓటరుతో ఒబామా ముచ్చట..!)

అలాగే 2016లో స్వింగ్ రాష్ట్రాల్లో గెలిచి అధ్యక్షుడైన ట్రంప్ ఈసారి అక్కడ సైతం వెనుకంజలో ఉన్నట్లు సీఎన్ఎన్ నివేదిక పేర్కొంది. హోరాహోరీ పోరు ఉండే మిచిగాన్, విస్కాన్సిన్, అరిజోనా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో ట్రంప్ కంటే బైడెనే మెరుగైన స్థితిలో ఉన్నారని సీఎన్ఎన్ తాజా నివేదిక తెలిపింది. కనుక ఈసారి పోల్స్ ఫలితాలు నిజమైతే మాత్రం బైడెన్ అమెరికా అధ్యక్షుడు కావడం ఖాయం.  

మరిన్ని వార్తలు