భారత్‌లో కరోనా కల్లోలం.. ఇతర దేశాలకు ఓ హెచ్చరిక: ఐఎంఎఫ్‌

22 May, 2021 19:31 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభణతో దేశ ప్రజలు ఆరోగ్యపరంగానే కాక ఆర్థికపరంగానూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ నేఫథ్యంలో భారత్‌ సంక్షోభాన్ని సూచిస్తూ ఐఎంఎఫ్‌ ప్రపంచంలోని ఇతర అల్ప, మధ్యాదాయ దేశాలకు ఇది ఒక హెచ్చరిక లాంటిదని తెలుపుతూ ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్, ఎకనమిస్ట్ రుచిర్ అగర్వాల్ సంయుక్తంగా రూపొందించారు.

అల్పాదాయ దేశాలకు ఇది ఓ హెచ్చరిక
నివేదిక ప్రకారం..  2021 చివరినాటికి  భారత జనాభాలో 35 శాతం వరకు మాత్రమే వ్యాక్సినేషన్‌ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత్ లో కరోనా సెకండ్ వేవ్, బ్రెజిల్లో చెలరేగిన కరోనా కల్లోలం పరిస్థితులను గమనిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మరింత దారుణమైన పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. కరోనా ఫస్ట్‌ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని తట్టుకున్న భారత్‌ సెకండ్‌ వేవ్‌ వ్యాప్తిని అడ్డకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతోందని తెలిపింది. విపరీతమైన కేసులు కారణంగా ఆక్సిజన్, బెడ్లు , ఇతర వైద్య సౌకర్యాలు లేక అనేకమంది మరణిస్తున్నట్లు వివరించింది. ఇప్పటివరకు ఆఫ్రికాతో సహా పలు ప్రాంతాల్లో ఈ ముప్పును తప్పించుకోగలిగాయని పేర్కొంది. అయితే ప్రస్తుత భారత్ పరిస్థితి అల్పాదాయ, మధ్యాదాయ దేశాలకు ఓ హెచ్చరిక లాంటిదని ఈ నివేదికలో తెలిపింది . భారత్ 60 శాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యం సాధించాలంటే తక్షణమే 100 కోట్ల డోసులకు ఆర్డరు చేయాల్సి ఉంటుందని సూచించింది.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో తక్కువ కాలంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి అధికారులు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్‌లకు సుమారు 600 మిలియన్ డాలర్ల ఫైనాన్సింగ్ ప్రకటించడం స్వాగతించే అంశం అని పేర్కొంది. అలాగే అధికారులు 2021 చివరి నాటికి రెండు బిలియన్ డోసులను అందుబాటులో వస్తాయని అంచనా వేస్తున్నారని తెలిపింది. ప్రస్తుతం అధికారులు వైద్య పరమైన అవసరాల కోసం దేశీయంగా ఉన్న వనరులను ఉపయోగిస్తున్నారు. అయితే వీటి కోసం విదేశీయంగాను ఫైనాన్సింగ్ కోసం ప్రయత్నిస్తున్నందున, మా బడ్జెట్‌లో భారతదేశానికి అదనపు నిధులను కేటాయించలేమని ఐఎంఎఫ్‌ తేల్చింది.

చదవండి: వెలుగులోకి కొత్త కరోనా.. కుక్కలనుంచి మనుషులకు!

మరిన్ని వార్తలు