వ్యాక్సిన్‌ పంపిణీపై ఐఎంఎఫ్‌ కీలక వ్యాఖ్యలు

10 Sep, 2020 15:53 IST|Sakshi

అల్పాదాయ దేశాలకు ఐఎంఎఫ్‌ ఊతం

న్యూయార్క్‌ : కరోనా వైరస్‌ సృష్టించిన సంక్షోభం ఇప్పట్లో సమసిపోదని, వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత అది అందరికీ అందేలా బహుముఖ సహకారం అవసరమని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) హెచ్చరించింది.  ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకుల చొరవతో చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా కోవిడ్‌-19 నుంచి కోలుకునే పరిస్థితి కనిపిస్తోందని, దీనికి మరిన్ని చర్యలు అవసరమని ఫారెన్‌ పాలసీ మ్యాగజీన్‌లో ప్రచురితమైన ఓ వ్యాసంలో ఐఎంఎఫ్‌ పేర్కొంది. కరోనా వైరస్‌ నుంచి చోటుచేసుకుంటున్న రికవరీ పరిమితంగానే ఉందని, అన్ని రంగాలు, ప్రాంతాల్లో అసమానతలతో నిండిఉందని ఈ వ్యాసంలో ఐఎంఎఫ్‌ మేనజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టాలినా జార్జివా, ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌లు పేర్కొన్నారు. చదవండి : ఊహించినదానికంటే లోతైన మాంద్యం : గీతా గోపీనాథ్

కరోనా వైరస్‌ కల్లోలంతో ఈ సంక్షోభ ఫలితంగా 2021 సంవత్సరాంతానికి 12 లక్షల కోట్ల డాలర్ల మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ఫలితంగా అల్పాదాయ దేశాలకు నిరంతర సాయం​ కీలకమని తెలిపింది. కరోనా వైరస్‌ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 75 దేశాలకు ఐఎంఎఫ్‌ అత్యవసర నిధులను సమకూర్చగా, మధ్యాదాయ దేశాలకు విస్తృతస్ధాయిలో ఊతమిచ్చే చర్యలను కొనసాగించేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. ఇక పేద దేశాలు సహా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో 76 సంపన్న దేశాలు కోవ్యాక్స్‌ కూటమికి వెన్నుదన్నుగా నిలవడం పట్ల ఐఎంఎఫ్‌ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఈ కూటమిలో చేరబోమని అమెరికా ప్రకటించడం గమనార్హం.

మరిన్ని వార్తలు