పరువు తీసుకున్న పాక్‌ నేతలు‌.. ట్రెండింగ్‌లో వీడియో

14 Apr, 2022 19:11 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో గత కొద్ది రోజులుగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇమ్రాన్‌ఖాన్‌ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో పాక్‌ నూతన ప్రధానిగా షెహ‌బాజ్ ష‌రీఫ్ ఎన్నికైన విషయం తెలిసిందే. అనంతరం మాజీ ప్రధాని ఇమ్రాన్‌.. అటు పాకిస్తాన్‌ నేతలపై, ఇటు భారత్‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఇదిలా ఉండగా.. పాక్‌లో ప్రస్తుత ప్రధాని షెహ‌బాజ్ ష‌రీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ మ‌ద్దతుదారులు, నేతలు ఓ స్టార్‌ హోటల్‌లో రచ్చరచ్చ చేశారు. ఇఫ్తార్‌ విందులో ఇరు వర్గాల మద్దతుదారులు, నేతలు కొట్టుకున్నారు. ఒక‌రిపై ఒక‌రు డ్రింక్స్ , ఫుడ్ విసురుకున్నారు. బూతులు తిట్టుకుంటూ నానా హంగామా చేశారు. ఓ బాడీ బిల్డర్‌.. వృద్ధుడిపై దాడికి దిగి భారీ పంచ్‌లు విసిరాడు. దీంతో కిందపడిపోయిన అతడిని లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరోవైపు.. ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాను మరింత ప్రమాదకరంగా మారుతానని గురువారం హెచ్చరించారు. నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రమాదకారి కాదు. కానీ ఇప్పుడు నేను మరింత ప్రమాదకారిగా మారుతానని పేర్కొన్నారు. అయితే అవిశ్వాస తీర్మానంతో ప్రధాని పదవి నుంచి దిగిపోయి వారం కూడా గడవకముందే ఇమ్రాన్‌ ఖాన్‌ ఇలా హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేగాక పాకిస్థాన్‌ న్యాయవ్యవస్థపై కూడా ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నల వర్షం కురిపించారు. శనివారం అర్ధరాత్రి దాకా న్యాయస్థానం తలుపులు తెరవడం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని తెలపాలని డిమాండ్‌ చేశారు. నేను న్యాయవ్యవస్థను అడుగుతున్నాని..  మీరు అర్ధరాత్రి వరకు కోర్టును ఎందుకు తెరిచి ఉంచారని ప్రశ్నించారు.  

ఇది చదవండి: నార్త్‌ కొరియా కిమ్‌ సంచలన నిర్ణయం.. సోషల్‌ మీడియాలో వైరల్‌

మరిన్ని వార్తలు