Pakistan: ఇమ్రాన్‌ ఖాన్‌ క్లీన్‌ బౌల్డ్‌.. హై డ్రామా ఓవర్‌

10 Apr, 2022 08:26 IST|Sakshi

ఇస్లామాబాద్‌: అనేక నాటకీయ పరిణామాల మధ్య పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం ముగిసింది. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పదవిని కోల్పోయారు. శనివారం పాక్‌ జాతీయ అసెంబ్లీ అనేక  వాయిదా పర్వాల మధ్య ఎట్టకేలకు ఇమ్రాన్‌కు గట్టి షాక్‌ తగిలింది. సుమారు 14 గంటల పాటు సాగిన జాతీయ అసెంబ్లీ.. అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్‌ను సాగనంపింది. పాకిస్తాన్‌ చరిత్రలో అవిశ్వాసం ద్వారా పదవిని కోల్పోయిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ రికార్డుల్లో నిలిచారు.

ఆదివారం తెల్లవారుజామున అవిశ్వాస తీర్మానం జరిగింది. విపక్షాలు ఇమ్రాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఓటింగ్‌లో ఇమ్రాన్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా 174 ఓట్లు వచ్చినట్లు జాతీయ అసెంబ్లీ స్పీకర్‌ ఆయాజ్‌ సాదిఖ్‌ ప్రకటించారు. దీంతో ఆయన పదవిని కోల్పోయారు. ఓటింగ్‌ సందర్బంగా పాక్‌ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులు ఉన్నారు. మెజార్టీకి 172 మంది బలం కావాల్సి ఉండగా అధికార పార్టీకి 2 ఓట్లు తగ్గాయి. దీంతో ఇమ్రాన్‌ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. 

రెండు సీట్ల నుంచి ప్రధాని పదవి వరకు..  
1992లో పాక్‌కు ప్రపంచ కప్‌ అందించాక క్రికెట్‌కు గుడ్‌బై కొట్టిన ఇమ్రాన్‌ఖాన్‌ ప్రజాసేవ వైపు మళ్లారు. 1996లో అందరికీ న్యాయం అన్న నినాదంతో పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఇ–ఇన్సాఫ్‌ (పీటీఐ) అన్న పార్టీని స్థాపించారు.మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పీటీఐ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. అవినీతికి వ్యతిరేకంగా 2008 ఎన్నికల్ని బహిష్కరించిన ఇమ్రాన్‌ఖాన్‌ 2011 వచ్చేసరికి అనూహ్యంగా పుంజుకున్నారు.

 ప్రధాన పార్టీలైన నవాజ్‌ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (ఎన్‌), బేనజీర్‌ భుట్టోకు చెందిన పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ)ని ఢీ కొట్టి బలమైన మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగారు. 2013 నాటికల్లా పీటీఐ 35 సీట్లతో  ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. ప్రధానంగా ఆయన నవాజ్‌ షరీఫ్‌ అవినీతిపైనే న్యాయపోరాటం చేసి, చివరికి ఆయనని జైలు పాలు చేశారు. 2018 ఎన్నికల్లో జాతీయ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రధాని పీఠం అందుకున్నారు.

మరిన్ని వార్తలు