‘మొత్తం ప్రతిపక్షాన్ని క్లీన్‌స్వీప్‌ చేయాలని ఇమ్రాన్‌ చూస్తున్నారు’

19 Jun, 2022 15:52 IST|Sakshi

Imran Khan wanted to clean sweep the entire opposition leadership: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై పాక్‌ విద్యుత్‌ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఖాన్‌ 15 ఏళ్లు తానే పాలన సాగించేలా ఫాసిస్ట్‌ ప్లాన్‌లు వేస్తున్నారని పాక్‌ విద్యుత్‌ శాఖ మంత్రి ఖుర్రం దస్తగిరి ఆరోపణలు చేశారు. ఈ ఏడాది చివరి నాటికల్లా ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్, అహ్సాన్ ఇక్బాల్, పాకిస్థాన్ మాజీ ప్రధాని షాహిద్ ఖాకాన్ అబ్బాసీతో సహా మొత్తం ప్రతిపక్ష నాయకత్వాన్నే ఇమ్రాన్ ఖాన్ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తున్నట్లు తనకు ముందస్తు సమాచారం ఉందని కూడా చెప్పారు.

ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా తన రాజకీయ ప్రత్యర్థులపై కేసులను వేగవంతం చేసేందకు సుమారు 100 మంది న్యాయమూర్తి నియమిస్తానని బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇమ్రాన్‌ఖాన్‌ దేశం పై దాడి చేసేలా ఫాసిస్ట్‌ ప్లాన్‌లు కలిగి ఉన్నందునే సంకీర్ణం ఏర్పడిందంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలకు పాక్‌ మాజీ మంత్రి అలీ హైదర్ జైదీ స్పందిస్తూ...రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కుట్ర ద్వారా తొలగించినట్లు ఖుర్రం దస్తగిర్ బహిరంగంగానే అంగీకరించాడని చెప్పారు. అవినీతి కేసుల నుంచి ప్రతిపక్షాలను కాపాడేందుకు ఇలా చేశారు. ఈ దుండగులు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నభిన్నం చేయాలని చూస్తుండటం బాధాకరం అన్నారు.

అంతేకాదు ఖాన్‌ కూడా రష్యా, చైనా మరియు అఫ్గనిస్తాన్‌ల స్వతంత్ర విదేశాంగ విధాన నిర్ణయాల కారణంగా తాను ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానంలో ఓటమిని  ఎదుర్కొన్నానని అన్నారు. పైగా ఖాన్‌ ఇది యూఎస్‌ కుట్రలో భాగమని కూడా ఆరోపించారు. ప్రస్తుత ప్రధాని షరీఫ్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం దిగుమతి చేసుకున్నదని, పాకిస్తాన్‌కి ఆయన నిజమైన ప్రతినిధి కాదంటూ ఇమ్రాన్‌ఖాన్‌ తన మద్దతుదారులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.

(చదవండి: ఆకాశమంత దట్టమైన పోగ...కెమికల్‌ ప్లాంట్‌ భారీ పేలుడు...ఒకరు మృతి)

మరిన్ని వార్తలు