పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు మరో భారీ షాక్‌.. చివరి బంతిదాకా కష్టమే..

30 Mar, 2022 18:22 IST|Sakshi

ఇస్లామాబాద్‌: చివరి బంతి దాకా బరిలో ఉంటానన్న ఇమ్రాన్‌ఖాన్‌ ఆట ఆడకుండానే వెనుదిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష పీఎంఎల్‌–ఎన్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్‌ 3న పార్లమెంట్‌లో ఓటింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలోనే కీలక భాగస్వామ్య పక్షమైన ఎమ్‌క్యూఎమ్‌ బుధవారం సంకీర్ణానికి గుడ్‌బై చెప్పి, ప్రతిపక్షానికి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పాక్ జాతీయ అసెంబ్లీలో విపక్షాల బలం 176కు పెరిగింది. అధికార కూటమి బలం 164కు పడిపోయింది. దీంతో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మెజార్టీ కోల్పోయారు. అయితే అవిశ్వాస తీర్మానం విదేశీ శక్తులు సృష్టించిన సంక్షోభమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఆరోపించారు‌. దీనిపై మీడియాకు ఆధారాలు విడుదల చేస్తానని తెలిపారు.

ఇదిలా ఉండగా, పాక్‌ జాతీయ అసెంబ్లీలో 342 సభ్యులకుగాను పీటీఐకి 155 మంది ఉన్నారు. మరో ఆరు పార్టీల నుంచి 23 మంది మద్దతుతో ఇమ్రాన్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అవిశ్వాస గండం గట్టెక్కాలంటే 172 మంది మద్దతు కావాలి. కానీ 24 మంది సొంత ఎంపీల తిరుగుబాటుతో పాటు, ఐదుగురు సభ్యులున్న ఎమ్‌క్యూఎమ్‌ కూడా సంకీర్ణానికి గుడ్‌బై చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్‌ చివరి బంతిదాకా మ్యాచ్‌ను కొనసాగించకుండా రాజీనామా చేస్తారని సమాచారం.

చదవండి: (యుద్దం ముగిసిపోలేదు: జెలెన్‌స్కీ)

జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తారా ? 
అవిశ్వాసం తీర్మానం నెగ్గడం, ఇమ్రాన్‌ గద్దె దిగడం ఖాయమన్న వార్తల నేపథ్యంలో ఆయన ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారంటున్నానరు. జాతీయ అసెంబ్లీ గడువు ఎటూ ఏడాదిలో ముగియనున్నందున దాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సన్నిహితులు సూచిస్తున్నారు. ఆదివారం ఇస్లామాబాద్‌లో ఇమ్రాన్‌ జరిపిన ర్యాలీ బల ప్రదర్శనేనన్న అభిప్రాయాలున్నాయి. లండన్‌లో కూర్చున్న వ్యక్తి పాక్‌లో ప్రభుత్వాన్ని మార్చడానికి విదేశీ డబ్బును వాడుతున్నారంటూ విపక్ష నేత నవాజ్‌ షరీఫ్‌పై ర్యాలీలో ఇమ్రాన్‌ నిప్పులు చెరిగారు. ఇదంతా ఎన్నికల ప్రచారం మాదిరిగానే ఉందని, బహుశా ముందస్తుకు ఇమ్రాన్‌ సై అంటారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు