ఇమ్రాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర? 75 ఏళ్ల పాక్‌ చరిత్రలో..

31 Mar, 2022 07:32 IST|Sakshi

దారులన్నీ మూసుకుపోయాయి. అయినా రాజకీయ జీవితాన్ని నిలబెట్టుకునేందుకు ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నివిధాల ప్రయత్నిస్తున్నాడు. ఏది ఏమైనా రాజీనామాకు ససేమీరా అంటున్నాడు. మిత్ర పక్షాలన్నీ తనని గద్దె దించడం ఖాయమని ఫిక్స్‌ అయిపోయాడు పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌. ఈ నేపథ్యంలోనే.. జాతిని ఉద్దేశించి ప్రసంగించాల్సిన కార్యక్రమాన్ని సైతం ఆర్మీ సలహా మేరకు వాయిదా వేసుకున్నాడు కూడా. ఈ తరుణంలో.. పాకిస్థాన్‌ తెహ్రీక్‌-యి-ఇన్‌సాఫ్‌ పార్టీ (PTI) సంచలన వ్యాఖ్యలు చేసింది. 

ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, ఆయన హత్యకు కుట్ర జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు పీటీఐ సీనియర్‌ నేత ఫైజల్‌ వవ్దా. పాక్‌ రాజకీయాలను ప్రభావితం చేయాలని కొన్ని బయటి శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ సంక్షోభానికి తెర లేపాయి. ఆయన మొండిగా ముందుకెళ్తున్నాడు. అందుకే చంపాలని ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఫైజల్‌ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇమ్రాన్‌ హత్యకు కుట్ర జరుగుతోందన్న సమాచారం ఇంటెలిజెన్సీ వర్గాలు తమ ప్రభుత్వానికి అందించాయని పీటీఐ నేతలు పలువురు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బుల్లెట్‌ప్రూఫ్‌ షీల్డ్‌తో పాటు కార్లను సైతం ఉపయోగించాలని నిఘా వర్గాలు ఇమ్రాన్‌ ఖాన్‌కు సూచించాయట. అయితే  తాను చావుకు భయపడనని ఇమ్రాన్‌ ఖాన్‌.. తోటి నాయకులతో చెప్పినట్లు ఏఆర్‌వై న్యూస్‌ కథనం ప్రచురించింది. అయితే ప్రతిపక్షాలు ఇదంతా ఉత్త డ్రామాగా కొట్టిపారేస్తున్నాయి. 

మరోవైపు తన ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నాయని, ఇందుకోసం ప్రతిపక్షాలకు డబ్బు ఆశ ఎర చూపుతున్నాయని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపిస్తున్నాడు. ఇమ్రాన్‌ సర్కార్‌కు 172 మంది ప్రజాప్రతినిధుల మద్దతు అవసరం కాగా, ప్రస్తుతం 164 మంది ఉన్నారు. వీళ్లలోనూ మరికొందరు బయటకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.   చదవండి: ఖాన్‌కు అదనంగా విషమ పరీక్ష

విశేషం ఏంటంటే.. 75 ఏళ్ల పాక్‌ రాజకీయ చరిత్రలో ఏ ప్రధాని కూడా పూర్తి పదవీకాలం(ఐదేళ్లు) పూర్తి చేసుకోలేదు. మిలిటరీ జోక్యంతో దాదాపుగా గద్దె దిగిపోవడం లేదంటే శరణార్థులుగా బయటి దేశాలకు పారిపోవడం జరిగింది. అలాగే ఏ ఒక్కరూ అవిశ్వాసంలో ఓడిపోలేదు కూడా. ఇమ్రాన్‌ ఖాన్‌ ఇప్పటికే నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నాడు. ఈ తరుణంలో.. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనలోనూ ఉన్నాడు. మరోవైపు ఇమ్రాన్‌ ఖాన్‌ నుంచి రాజీనామాను ఆశించని ప్రతిపక్ష కూటమి నేత, పీఎంఎల్‌-ఎన్‌ చీఫ్‌ షహబాజ్‌ షరీఫ్‌.. తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు పాక్‌ రాజకీయ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.

సంబంధిత వార్త: లాస్ట్ ఓవర్‌.. ఐదు బంతులు.. 36 పరుగులు.. 

మరిన్ని వార్తలు