Imran Khan: దండెత్తకున్నా పాక్‌ను అమెరికా బానిసగా చేసుకుంది: ఇమ్రాన్‌ ఖాన్‌ బహిరంగ ఆరోపణలు

16 May, 2022 17:00 IST|Sakshi
ఆంటోనీ బ్లింకెన్‌(ఎడమ), ఇమ్రాన్‌ ఖాన్‌ (కుడి)

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌.. అగ్రరాజ్యంపై  ప్రత్యక్షంగా సంచలన ఆరోపణలకు దిగాడు. ఆక్రమించుకోకుండానే పాకిస్థాన్‌ను అమెరికా బానిస చేసుకుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. తన పదవి పోవడానికి విదేశీ కుట్రే కారణమని, అది అమెరికా నుంచే జరిగిందని గతంలోనూ ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే.

ప్రధాని గద్దె దిగిపోయాక.. పీటీఐ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ పలు నగరాల్లో వరుసగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం పంజాబ్‌ ప్రావిన్స్‌ ఫైసలాబాద్‌ ర్యాలీలో ప్రసంగించాడు. దిగుమతి ప్రభుత్వాన్ని(షెహ్‌బాజ్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) పాక్‌ ప్రజలు ఏనాటికి అంగీకరించబోరని, ఈ ప్రభుత్వ నేతలు అవినీతిపరులని, అమెరికాకు తొత్తులంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. 

పాకిస్థాన్‌పై దురాక్రమణకు పాల్పడలేదు. సైన్యాన్ని దించలేదు. అయినా పాక్‌ను బానిసగా మార్చేసుకుంది అమెరికా. ఇలాంటి దిగుమతి ప్రభుత్వాన్ని పాక్‌ ప్రజలు ఏనాటికీ ఒప్పుకోరు అంటూ ప్రసంగించాడు ఇమ్రాన్‌ ఖాన్‌. 

అమెరికా అనేది పచ్చి అవకాశవాద దేశం. స్వార్థపూరిత దేశం. తమ ప్రయోజనాల కోసం ఇతర దేశాలకు ఏమాత్రం సాయం చేయదన్నారు. అమెరికా ప్రతినిధి ఆంటోనీ బ్లింకెన్ నుంచి పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారి డబ్బు కోసం ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ మేరకు లోపాయికారీ ఒప్పందం జరిగిందంటూ పేర్కొన్నాడు ఇమ్రాన్‌ ఖాన్‌. జర్దారి, ఆయన తండ్రి అత్యంత అవినీతి పరులని, వాళ్ల ఆస్తులను పరిరక్షించుకునేందుకు అమెరికాకు లొంగిపోయారంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు ఇమ్రాన్‌ ఖాన్‌.

మరిన్ని వార్తలు