ఇమ్రాన్‌ ఖాన్‌ బ్యాడ్‌ టైం స్టార్ట్‌.. కక్కుర్తి పనిపై దర్యాప్తు ప్రారంభం

13 Apr, 2022 18:38 IST|Sakshi

పాకిస్తాన్‌ తాజా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు బ్యాడ్‌ టైం స్టార్ట్‌ అయ్యింది. అవినీతి ఆరోపణల ఉచ్చు బిగియడం మొదలైంది. పదవి దిగిపోయి వారం గడవక ముందే ఖరీదైన ఓ ఆభరణం విషయంలో చిక్కుల్లో పడ్డాడు ఇమ్రాన్‌ ఖాన్‌. 

పాక్‌ ప్రధాని హయాంలో బహుమతిగా అందుకున్న ఖరీదైన నెక్లెస్‌ను గిఫ్ట్ రిపోజిటరీలో డిపాజిట్ చేయకుండా.. డబ్బు కక్కుర్తితో ఓ నగల వ్యాపారికి విక్రయించారనే ఆరోపణలపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై పాకిస్థాన్ ఉన్నత దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించింది.

తోషా ఖానా(స్టేట్‌ గిఫ్ట్‌ రిపోజిటరీ)కి కాకుండా.. స్పెషల్‌ అసిస్టెంట్‌ జుల్ఫికర్‌ భుఖారికి ఇచ్చారని, అక్కడి నుంచి ఆ ఆభరణం లాహోర్‌లో ఓ వ్యాపారి వద్ద 18 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయిందని ది ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ పత్రిక ఓ కథనం ప్రచురించింది. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు అవసరం మేరకే ఖాన్‌ ఆ పని చేసి ఉంటాడని సదరు కథనం ఉటంకించింది.

ఈ మేరకు ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (FIA).. ఈ ఆరోపణలకు గానూ ఇమ్రాన్‌ ఖాన్‌ను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజా బహుమతులపై సగం ధర చెల్లించి వ్యక్తిగత గదిలో ఉంచుకోవచ్చు.  కానీ, ఖాన్ మాత్రం వచ్చిన సొమ్మును విరుద్ధంగా జమ చేశాడు, ఇది చట్టవిరుద్ధమని సదరు ఏజెన్సీ ఒక నివేదికలో పేర్కొంది.

మరిన్ని వార్తలు