పాక్‌ తాలిబన్లతోనూ ఇమ్రాన్‌ రాజీ!

10 Nov, 2021 01:27 IST|Sakshi

నెల రోజులపాటు కాల్పుల విరమణ ఒప్పందం

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో భద్రతాబలగాలు, పౌరులే లక్ష్యంగా గడిచిన 14 ఏళ్లుగా దాడులకు పాల్పడుతున్న పాకిస్తానీ తాలిబన్‌ ఉగ్ర సంస్థతో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం  డిసెంబర్‌ 9 వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇమ్రాన్‌ ప్రభుత్వం, తెహ్రిక్‌–ఇ–తాలిబన్‌ పాకిస్తాన్‌(టీటీపీ) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో అఫ్గాన్‌ తాలిబన్‌ ప్రభుత్వం సహకరించినట్లు ప్రభుత్వ ప్రతినిధి ఫవాద్‌ చౌదరి వెల్లడించారు. టీటీపీ ప్రతినిధి మొహమ్మద్‌ ఖురాసానీ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. ఈ నెల రోజుల్లో రెండు వర్గాల ప్రతినిధులతో ఏర్పడిన కమిటీ చర్చలు కొనసాగిస్తుందని ఆయన వివరించారు.

గత నెలలో పాక్‌ ప్రభుత్వం, టీటీపీ మధ్య మొదలైన చర్చల నేపథ్యంలో తాజాగా ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం గమనార్హం. ఈ చర్చల్లో పురోగతి కనిపిస్తే కాల్పుల విరమణ కూడా కొనసాగనుందని ఫవాద్‌ చెప్పారు. చర్చల వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. కాగా, అఫ్గాన్‌ తాలిబన్‌ అనుబంధ సంస్థే టీటీపీ. పాకిస్తానీ ఉగ్రవాదులతో 2007లో ఏర్పాటైన ఈ సంస్థ జరిపిన వందలాది దాడుల్లో వేలాదిగా ప్రజలు చనిపోయారు. కాగా, ఉగ్ర సంస్థగా పాక్‌ అధికారికంగా గుర్తించిన తెహ్రిక్‌–ఇ–లబ్బాయిక్‌ పాకిస్తాన్‌(టీఎల్‌పీ)పై ఉన్న నిషేధాన్ని  ఇమ్రాన్‌ ప్రభుత్వం ఎత్తివేసిన విషయం తెలిసిందే.  
 

మరిన్ని వార్తలు