ఏంటి ఇమ్రాన్‌ ఖాన్‌ ఇది.. దెబ్బకు వీడియో మాయం!

21 Apr, 2021 13:50 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ షేర్‌ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రతిపక్షాల వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆయన‌‌, ఓ బాలీవుడ్‌ మూవీ క్లిప్పింగ్‌ను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ఈ మేరకు.. ‘‘అవినీతి శక్తులు పీటీఐ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇదిగో ఇలాగే కుట్ర చేస్తున్నాయి’’ అంటూ కామెంట్‌ జతచేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీశాయి. కాగా ఇమ్రాన్‌ ఖాన్‌ సర్కారుపై పూర్తిస్థాయి పెత్తనం చెలాయించేందుకు మిలిటరీ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

అదే విధంగా.. అధికార పార్టీ పాకిస్తాన్‌ తెహ్రికీ ఇన్సాఫ్‌ ( పీటీఐ) అభ్యర్థి,  పాక్‌ ఆర్థిక మంత్రి అబ్దుల్‌ హఫీజ్‌ షేక్‌ సెనేట్‌ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడిన నేపథ్యంలో... ఇమ్రాన్‌ రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఆయన అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని చెప్పి, గత నెలలో నిర్వహించిన విశ్వాస తీర్మానంలో గెలుపొందారు. ఓటింగ్‌ సమయంలో  ప్రతిపక్ష పాకిస్తాన్‌ డెమొక్రాటిక్‌ మూమెంట్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేయడంతో బల పరీక్షలో సులువుగా విజయం సాధించగలిగారు.

అప్పటి నుంచి పీటీఐ ప్రభుత్వంపై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రతిపక్ష తీరును ఎండగడుతూ.. ఈ మేరకు ‘ఇంక్విలాబ్‌’ మూవీలోని సీన్‌ను వాడుకున్నారు. కాగా 1984 నాటి ఈ సినిమాలో అవినీతిపరుడైన ఓ రాజకీయ నాయకుడి పాత్రధారి కేదార్‌ ఖాన్‌, తన పార్టీ సభ్యులతో కలిసి ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలన్న అనైతిక అంశాల గురించి చర్చిస్తూ ఉంటాడు. దీనిని వాడుకున్న ఇమ్రాన్‌ ఖాన్‌, తాము ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుంచి ప్రతిపక్షాలు ఇలాగే కుట్రపన్నుతున్నాయంటూ వ్యాఖ్యానించారు.

అయితే, ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా రచ్చకెక్కడం, అది కూడా తాను గతంలో దిగజారుడు ఇండస్ట్రీ అంటూ విమర్శించిన బాలీవుడ్‌ సినిమాను అందుకు ఉపయోగించడం పట్ల నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేశారు. దీంతో ఆయన వీడియోను డిలీట్‌ చేశారు. అయితే, అప్పటికే ఆ దృశ్యాలను క్యాప్చర్‌ చేసిన జర్నలిస్టు నైలా ఇనాయత్‌.. ‘‘మంచిది.. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను రక్షించేందుకు బాలీవుడ్‌ ముందుకు వచ్చిందన్న మాట’’అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. దీంతో మరోసారి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

మరిన్ని వార్తలు