ఐరాస వేదికపై కెనడాకు భారత్‌ చురకలు.. పాక్, అమెరికాలకు కూడా 

27 Sep, 2023 08:31 IST|Sakshi

అది పక్కా అవకాశవాద ధోరణే 

విదేశాంగ మంత్రి జై శంకర్‌ నిప్పులు 

ఏకస్వామ్య పోకడలు చెల్లవిక! 

పెద్ద దేశాల తీరునూ ఎండగట్టిన మంత్రి

ఐక్యరాజ్యసమితి: ఖలిస్తానీ ఉగ్రవాదం విషయంలో మెతకగా వ్యవహరిస్తున్న కెనడాకు ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్‌ చురకలంటించింది. ఉగ్రవాదం, తీవ్రవాదం, హింసల విషయంలో కేవలం రాజకీయ సౌలభ్యం కోసం మెతక వైఖరి అవలంబించడం సరికాదని స్పష్టం చేసింది. ఇలాంటి అవకాశవాద ధోరణులకు దూరంగా ఉండాలని ఐరాస సభ్య దేశాలకు పిలుపునిచ్చింది. మంగళవారం ఐరాస 78వ సర్వ సభ్య సమావేశంలో మాట్లాడిన విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్‌ ఈ మేరకు కుండ బద్దలు కొట్టారు.

కశ్మీర్‌ విషయంలో అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌ ప్రదర్శిస్తున్న కొద్ది బుద్ధులను కూడా ఏకిపారేశారు. ‘ప్రాదేశిక సమగ్రత, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టరాదన్నవి కనీస మర్యాదలు. అంతే తప్ప ఇలాంటి విషయాల్లో తమ రాజకీయ స్వార్థాలకు, అవసరాలకు అనుగుణంగా ఇష్టానికి వైఖరులు మార్చుకునే తీరు సరి కాదు‘ అంటూ పాక్‌ తో పాటు పరోక్షంగా అమెరికా తీరును కూడా దుయ్యబట్టారు.

ఐరాస వేదికగా పాక్‌ తాత్కాలిక ప్రధాని ఇటీవల దిగజారుడు వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇక కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదాలకు, దౌత్య సంక్షోభానికి దారి తీసింది. హత్యలో భారత్‌ ప్రమేయం ఉందన్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో వ్యాఖ్యలతో మంటలు రాజుకున్నాయి.

ఖలిస్తానీ అనుకూల పార్టీ మద్దతుతో అధికారాన్ని కాపాడుకుంటున్న ట్రూడో వారిని మంచి చేసుకునేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన సొంత పార్టీ ఎంపీలే విమర్శిస్తుండటం తెలిసిందే. అంతేగాక నిజ్జర్‌ హత్యకు సంబంధించి నిఘా సమాచారాన్ని కెనడాతో అమెరికా పంచుకుందని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పాక్, అమెరికా తీరును పరోక్షంగా దుయ్యబడుతూ ఐరాస వేదికపై జై శంకర్‌ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

పెద్ద దేశాలూ, కొద్ది బుద్ధులు! 
పెద్ద దేశాల పెత్తందారీ, ఏకపక్ష పోకడలకు వ్యతిరేకంగా వర్ధమాన దేశాల గొంతుకను ఐరాస వేదికపై జై శంకర్‌ ఈ సందర్భంగా గట్టిగా వినిపించారు. కొన్ని పెద్ద దేశాలే తమ అవసరాలకు అనుగుణంగా అజెండాను నిర్దేశించి, మిగతా దేశాలన్నీ తమను అనుసరించాలని కట్టడి చేసే రోజులకు కాలం చెల్లిందని స్పష్టం చేశారు. ‘ఈ పోకడలు ఎల్లకాలమూ చెల్లవు. వాటినెవరూ సవాలే చేయరని అనుకోవద్దు. వ్యాక్సిన్ల విషయంలో వర్ణ వివక్షను ఇంకెప్పుడూ అనుమతించరాదు. వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేయడంలో పెద్ద దేశాలు తమ బాధ్యతలను తప్పించుకోరాదు.

నిరుపేద దేశాలకు అందాల్సిన ఆహార, ఇంధన నిల్వలను పెద్ద దేశాలు తమ మార్కెట్‌ బలాన్ని ఉపయోగించి చెరబట్టరాదు‘ అంటూ శషభిషలకు తావు లేకుండా స్పష్టం చేశారు. అభివృద్ధిలోనూ, అన్నింట్లోనూ అన్ని దేశాలకూ సమాన భాగస్వామ్యం కల్పించే నూతన ప్రజాస్వామిక వాతావరణం నెలకొని తీరుతుందని మంత్రి ధీమా వెలిబుచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా అన్ని రకాల నిబంధనలు అన్ని విషయాల్లోనూ అన్ని దేశాలకూ సమానంగా వర్తించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత్‌ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు.

అలీనోద్యమానికి మద్దతిచ్చిన రోజుల నుంచి విశ్వ మిత్ర (ప్రపంచ నేస్తం) స్థాయి దాకా భారత్‌ ఎదిగింది. మిగతా దేశాలన్నీ తమ జాతీయ ప్రయోజనాలే చూసుకుంటాయి. భారత్‌ మాత్రం విశ్వ శ్రేయస్సునే తన మేలుగా భావిస్తుంది‘ అని స్పష్టం చేశారు. ఆ గురుతర బాధ్యతను దృష్టిలో ఉంచుకునే జీ20 సారథ్యాన్ని భారత్‌ స్వీకరించిందని వివరించారు. ‘ఇతర దేశాల వాదనను సానుభూతితో వినడం, వాటి వైఖరిని గౌరవించడం బలహీనత కాదు. పరస్పర సహకారానికి సూచిక. ఐరాస లక్ష్యానికి కొనసాగింపు‘ అంటూ చైనా మితి మీరిన దూకుడుకు కూడా జై శంకర్‌ చురకలు వేశారు. 

మరిన్ని వార్తలు