పాంగాంగ్ సరస్సు నుంచి బలగాల ఉపసంహరణ

10 Feb, 2021 19:26 IST|Sakshi

న్యూఢిల్లీ: సరిహద్దు దేశం చైనా కవ్వింపు చర్యలతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. సరిహద్దులో గుంటనక్కలా వేచి చూస్తున్న చైనా చివరకు ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. సరిహద్దు వివాదంపై చైనా రక్షణ శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. భారత్‌లోని తూర్పు లద్దాఖ్‌లో పాంగాంగ్ సరస్సు నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకున్నట్లు చైనా రక్షణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన జారీ అయ్యింది. 

భారత బలగాలు కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయని చైనా తెలిపింది. కమాండర్ల స్థాయి చర్చలు ఫలించాయి. ఆ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా వెల్లడించింది. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. గాల్వాన్‌ లోయలో భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ మొదలు.. ఇప్పటి వరకు సరిహద్దుల వెంట తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

సరిహద్దుల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించడంతో యుద్ధ వాతావరణం ఏర్పడింది. పరిస్థితి రోజురోజుకు తీవ్రంగా మారడం.. ఎప్పుడైనా యుద్ధం జరుగుతుందేమో అనే దాక పరిస్థితి వచ్చింది. చివరకు అకస్మాత్తుగా చైనా వెనక్కి తగ్గింది. గాల్వాన్ ఘటన నుంచి ఇరు దేశాల సైనికాధికారులు చేస్తున్న చర్చలు ఇప్పటికీ ఫలించాయి. కమాండర్ల స్థాయి చర్చల తర్వాత ఇరు దేశాలు తమ సైన్యాన్ని సరిహద్దుల్లోంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.

మరిన్ని వార్తలు