ఐదు అంశాల్లో ఏకాభిప్రాయం

12 Sep, 2020 03:56 IST|Sakshi
గురువారం రష్యాలో భేటీ సందర్భంగా భారత్, చైనా విదేశాంగ మంత్రులు జై శంకర్, వాంగ్‌ యి

వాటిలో.. సాధ్యమైనంత త్వరగా బలగాల ఉపసంహరణ, ఆర్మీ అధికారుల మధ్య చర్చల కొనసాగింపు అంశాలు

సరిహద్దుల్లో ఉద్రిక్తతల సడలింపునకు భారత్, చైనా అంగీకారం

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంట నెలకొన్న తీవ్రస్థాయి ఉద్రిక్తతలను తొలగించే దిశగా భారత్, చైనా ముందడుగు వేశాయి. మాస్కోలో గురువారం జరిగిన రెండు దేశాల విదేశాంగ మంత్రుల భేటీలో ఇందుకు సంబంధించి ఐదు అంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చాయి. సాధ్యమైనంత త్వరగా బలగాల ఉపసంహరణ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచేలా చర్యలు చేపట్టకపోవడం, వాస్తవాధీన రేఖ వెంట శాంతి, సంయమనం నెలకొనడం, రెండు దేశాల సరిహద్దు భద్రత దళాలు చర్చలు కొనసాగించడం, సైనిక బలగాల మధ్య దూరం పాటించడం అనే ఐదు అంశాల్లో ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.

షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సమావేశంలో పాల్గొనేందుకు మాస్కో వెళ్లిన భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి.. సరిహద్దుల్లో ఉద్రిక్తతల సడలింపు లక్ష్యంగా అక్కడ ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే. ఇరువురు నేతల మధ్య ఈ విషయంలో దాదాపు రెండున్నర గంటల పాటు నిర్మాణాత్మకంగా, నిర్మొహమాటంగా చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఉభయ దేశాలకు ప్రయోజనకరం కాదని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. తూర్పు లద్దాఖ్‌లో ప్యాంగాంగ్‌ సరస్సు కేంద్రంగా భారత్, చైనాలు భారీగా బలగాలను, యుద్ధ సామగ్రిని మోహరించిన విషయం తెలిసిందే.

విదేశాంగ మంత్రుల భేటీ సందర్భంగా కుదిరిన ఐదు అంశాల ఒప్పందం ప్రస్తుత సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు ఒక మార్గదర్శిగా నిలుస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. సరిహద్దు దళాలు చర్చలు కొనసాగించాలని, బలగాల ఉపసంహరణ సాధ్యమైనంత త్వరగా జరగాలని, ఇరు దేశాల సైన్యం తగినంత దూరం పాటించాలని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు’ అని పేర్కొంటూ శుక్రవారం ఉదయం ఒక సంయుక్త ప్రకటనను భారత విదేశాంగ శాఖ విడుదల చేసింది. అయితే, బలగాల ఉపసంహరణకు సంబంధించి ఎలాంటి కాల వ్యవధిని ఈ ఐదు అంశాల ఒప్పందంలో పేర్కొనలేదు. ‘సరిహద్దులకు సంబంధించిన అన్ని ఒప్పందాలు, ప్రొటోకాల్స్‌ను రెండు దేశాలు గౌరవించాలని, సరిహద్దుల్లో శాంతి, సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు పెరిగే చర్యలు చేపట్టకూడదని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్రిక్తతలు చల్లారిన తరువాత,.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పూర్వక వాతావరణం నెలకొనేలా విశ్వాస కల్పన చర్యలు చేపట్టడాన్ని వేగవంతం చేయాలని కూడా నిర్ణయించాయని వెల్లడించారు.

రాజ్‌నాథ్‌ ఉన్నతస్థాయి సమీక్ష
చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌æ శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ ధోవల్, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌æ బిపిన్‌ రావత్, ఆర్మీ చీఫ్‌ జనరల్‌  నరవణె, వైమానిక దళ చీఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ భదౌరియా, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించే ఉద్దేశంతో భారత్, చైనా విదేశాంగ మంత్రుల భేటీలో కుదిరిన ‘ఐదు అంశాల’ ఒప్పందంపై వీరంతా చర్చించారు. తూర్పు లద్దాఖ్‌లో భారత దళాల సన్నద్ధతను సమగ్రంగా సమీక్షించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని పేర్కొంటూ సంబంధిత వ్యూహాలను ఆర్మీ చీఫ్‌ జనరల్‌ నరవణె వివరించారు.
 

మరిన్ని వార్తలు