చైనాతో అత్యంత క్లిష్టంగా సంబంధాలు

21 Feb, 2022 06:31 IST|Sakshi
విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్‌

మ్యూనిక్‌: చైనాతో భారత సంబంధాలు ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నాయని విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్‌ అన్నారు. సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించవద్దన్న ఒప్పందాలను చైనా ఉల్లంఘించడంతో పరిస్థితి మరింత విషమించిందన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి సరిహద్దుల్లోని పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. జర్మనీలోని మ్యూనిక్‌లో జరుగుతున్న సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌ (ఎంఎస్‌సీ)లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

చైనాతో వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు 45 ఏళ్ల పాటు శాంతియుతంగానే ఉన్నాయని గుర్తు చేశారు. చైనా వంటి ఒక పెద్ద దేశం ఒప్పందాలను ఉల్లంఘిస్తే అది అంతర్జాతీయ సమాజమంతా ఆందోళన చెందాల్సిన విషయమేనన్నారు. సుదూరాల్లోని చిన్న దేశాలకు భారీగా అప్పులిచ్చి అక్కడి వ్యూహాత్మక ప్రాంతాలను చైనా తన అదుపులోకి తెచ్చుకుంటున్న తీరు ఆందోళనకరమని జై శంకర్‌ అన్నారు. అనుసంధానం ముసుగులో చేస్తున్న ఇలాంటి పనులు ఇతర దేశాల సార్వభౌమత్వానికి ముప్పని అభిప్రాయపడ్డారు. క్వాడ్‌ను ఆసియా నాటో అనడం సరికాదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు