అలాంటి రాజకీయాలు మీ ఇంట చేసుకోండి.. భగ్గుమన్న భారత్‌

21 Apr, 2022 19:52 IST|Sakshi

అమెరికా చట్టసభ్యురాలు ఇల్హాన్‌ ఒమర్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పర్యటించడంపై భారత్‌ భగ్గుమంది. సంకుచిత మనస్తత్వ రాజకీయాలకు ఇది నిదర్శనమని గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. 

సోమాలియాలో పుట్టిపెరిగి, అమెరికా చట్టసభ్యురాలైన ఇల్హాన్‌ ఒమర్‌(39) మొదటి నుంచి భారత వ్యతిరేకి.  నాలుగు రోజుల పాక్‌ పర్యటనలో భాగంగా ఏప్రిల్‌ 20 నుంచి 24వ తేదీల మధ్య పాక్‌లో పర్యటించనుంది. ఈ తరుణంలో ఇల్హాన్‌ ఒమర్‌, పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను ఇంటికెళ్లి మరీ కలిసింది. ఆపై ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యి కశ్మీర్‌ అంశంపైనా చర్చించింది కూడా.  ఈ తరుణంలో ఆమె పీవోకే పర్యటన చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయమై భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాఘ్ఛి స్పందించారు. ప్రస్తుతం పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకున్న జమ్ము కశ్మీర్‌లోని భారత కేంద్రపాలిత అంతర్భాగాన్ని ఆమె పర్యటించాలనుకోవడం మా దృష్టికి వచ్చింది. ఇలాంటి రాజకీయ నాయకురాలు.. తమ సంకుచిత రాజకీయాలను ఆచరించాలని కోరుకుంటే, అది ఆమె ఇష్టం. కానీ, అలాంటి ఆమె ఇంట చేసుకోవాలి. అంతేగానీ ఆ ముసుగులో భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా. కశ్మీర్‌ అంశంపై  ఒమర్‌తో జరిగిన భేటీ గురించి.. స్వయంగా ప్రధాని షెహబాజ్‌ మీడియాకు వివరించారు. లాహోర్‌తో పాటు ‘‘ఆజాద్ జమ్ము  కశ్మీర్‌’’ల గురించి ఆమెకు తెలుసని, ఆ ప్రాంతాల్లో ఆమె  సందర్శిస్తుందని పాక్‌ ప్రధాని తెలిపారు.

చదవండి: థ్యాంక్స్‌ ‘మోదీ జీ’.. పాక్‌ కొత్త పీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు