Gotabaya Rajapaksa: దేశం విడిచిన లంకాధ్యక్షుడు.. అంతా ఇండియానే చేసిందని వదంతులు.. హైకమిషన్‌ రియాక్షన్‌ ఏంటంటే?

13 Jul, 2022 10:42 IST|Sakshi
భార్య అయోమాతో శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స (పాత చిత్రం)

కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కుటుంబంతో సహా బుధవారం వేకువజూమునే దేశం విడిచి మాల్దీవులకు పారిపోయారు. అయితే ఆ తర్వాత కాసేపటికే ఆయన పారిపోయేందుకు భారత్ సహకరించిందని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై శ్రీలంకలోని భారత హైకమిషన్‌ కార్యాలయం స్పందించింది. ఈ వార్తలు నిరాధారం, కల్పితమైనవని కొట్టి పారేసేంది. ప్రజాస్వామ్యయుతంగా తమ ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న శ్రీలంక ప్రజలకు భారత్‌ సాయం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈమేరకు ట్వీట్ చేసింది.

మరోవైపు శ్రీలంక రక్షణ శాఖ నుంచి అవసరమైన అన్ని అనుమతులు లభించిన తర్వాతే గొటబాయ, ఆయన భార్య సైనిక విమానంలో మాల్దీవులకు వెళ్లారని సైన్యం వెల్లడించింది. మొదట మాలెలో దిగేందుకు అక్కడి ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోలర్స్‌ అనుమతి ఇవ్వలేదని, అయితే మాల్దీవుల పార్లమెంటు స్పీకర్ మజ్లిస్, మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ జోక్యం చేసుకుని గొటబాయ విమానం ల్యాండ్ అయ్యేందుకు మార్గం సుగమం చేశారని తెలిపారు. ఆంటొనొవ్‌ సైనిక విమానంలోనే గొటబాయ దేశం విడిచినట్లు ధ్రువీకరించారు.

మంగళవారమే దేశం విడిచి పారిపోవాలనుకున్న గొటబాయకు ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సిబ్బంది సహకరించలేదు. దీంతో ప్రత్యేక సైనిక విమానం ఏర్పాటు చేసుకుని బుధవారం వేకువజామునే మాల్దీవులకు వెళ్లారు.
చదవండి: గొటబాయకు ఎయిర్‌పోర్టులో అవమానం.. అరెస్టుకు భయపడి.. చివరికి సైనిక విమానంలో..

మరిన్ని వార్తలు