యూకే మంత్రి వీసా వ్యాఖ్యలపై భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

7 Oct, 2022 16:55 IST|Sakshi

లండన్‌: వీసా పరిమితి ముగిసినప్పటికీ బ్రిటన్‌లో ఉంటున్న వారిలో అధికంగా భారతీయులేనని యూకే హోంశాఖ మంత్రి సుయెల్లా బ్రేవర్మన్‌ చేసిన వ్యాఖ్యలను భారత్‌ తిప్పికొట్టింది. గత ఏడాది రెండు దేశాల మధ్య జరిగిన మైగ్రేషన్‌ అండ్‌ మొబిలిటీ పార్టనర్‌షిప్‌(ఎంఎంపీ) ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని సుయెల్లా పేర్కొనంటపై స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. ఒప్పందం కింద లేవనెత్తిన అన్ని అంశాలపై చర్యలు ప్రారంభించామని లండన్‌లోని భారత హైకమిషన్‌ స్పష్టం చేసింది. ఒప్పందంలో భాగంగా యూకే వైపు నుంచి సైతం స్పందన కోసం తాము ఎదురుచూస్తున్నామని తెలిపింది. 

యూకే హోంశాఖ మంత్రి సుయెల్లా బ్రేవర్మన్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ‍్యల అంశంపై ప్రశ్నించగా.. పలు విషయాలను వెల్లడించింది లండన్‌లోని భారత హైకమిషన్. ‘మైగ్రేషన్‌ అండ్‌ మొబిలిటీ ఒప్పందంలో భాగంగా వీసా పరిమితి ముగిసిన తర్వాత బ్రిటన్‌లో ఉంటున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు యూకేతో కలిసి పని చేసేందుకు కట్టుబడి ఉన్నాం. హోంశాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం అన్ని అంశాలపై చర్యలు ప్రారంభించాం. ఎంఎంపీ ఒప్పందంలో భాగంగా హామీలను నెరవేర్చేందుకు యూకే చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే వాటిలో సరైన పురోగతి కోసం తాము వేచి చూస్తున్నాం.’ అని లండన్‌లోని భారత హైకమిషన్‌ బదులిచ్చింది. 

మరోవైపు.. ఇరు దేశాల మధ్య చర్చల్లో ఉన్న ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై వీసా సంబంధిత రిజర్వేషన్లపైనా సుయెల్లా వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. భారత్‌తో ఎఫ్‌టీఏపై ఆందోళనలున్నట్లు పేర్కొన్నారు. దీనిపై భారత హైకమిషన్‌ స్పందిస్తూ.. ‘మొబిలిటీ, మైగ్రేషన్‌కు సంబంధించిన విషయాలపై ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. ఈ సమయంలో వాటి గురించి వ్యాఖ్యలు సమంజసం కాదు. భవిష్యత్తులో జరిగే ఏ ఒప్పందమైనా ఇరుదేశాలకు ప్రయోజనకరంగా ఉండాలి.’ అని పేర్కొంది. మరోవైపు.. యూకే మంత్రి వ్యాఖ్యలతో ఎఫ్‌టీఏలో భారతీయులకు వీసా రాయితీలకు మంత్రివర్గం మద్దతును నిలిపివేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: రష్యా, ఉక్రెయిన్‌ ‘హక్కుల’ గ్రూప్‌లకు నోబెల్‌ శాంతి బహుమతి

మరిన్ని వార్తలు