చైనాకు చెక్‌ పెట్టే సత్తా భారత్‌కే ఉంది.. అమెరికాకు కీలక భాగస్వామి అవుతుంది

28 Aug, 2022 04:20 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా నేవీ ఆపరేషన్స్ చీఫ్ మైక్‌ గిల్డే కీలకవ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో అగ్రరాజ్యానికి భారత్ ముఖ్య భాగస్వామి అవుతుందని, చైనాకు చెక్‌పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. హెరిటేజ్ ఫౌండేషన్‌ గురువారం ఏర్పాటు చేసిన సెమినార్‌లో పాల్గొన్న ఆయన ఈ మేరకు మాట్లాడారు.

భారత్‌ నుంచి చైనాకు రెండు సవాళ్లు ఎదరవుతాయని గిల్డే పేర్కొన్నారు. తూర్పు, దక్షిణ చైనా సముద్రం, తైవాన్ జలసంధి వైపు చూడాలని చైనాను బలవంతం చేస్తున్నారని, కానీ చైనా వాస్తవానికి పక్కనున్న భారత్‌ను గమనించాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణ ఆసియాలో భారత్ బలమైన దేశంగా ఉండటం అమెరికా, జపాన్‌కు అవసరం అన్నారు. భారత్‌తో  జాగ్రత్తగా ఉండాలనేలా చైనాను అప్రమత్తం చేయాలని సూచించారు.

భారత్, అమెరికా సైన్యాలు గతేడాది అక్టోబర్‌లో సైనిక విన్యాసాలు నిర్వహించిన విషయాన్ని గిల్డే గుర్తు చేశారు. అప్పుడే చైనాకు భారత సవాల్ అవుతుందని అంచనాకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లోనే తాను ఎక్కువ సమయం గడిపినట్లు చెప్పుకొచ్చారు.
చదవండి: ఉక్రెయిన్‌తో యుద్ధంలో అన్ని వేల మంది రష్యా సైనికులు చనిపోయారా?

మరిన్ని వార్తలు