కువైట్‌ ప్రయాణం చాలా ఖరీదు.. 15 వేల నుంచి 1.35 లక్షలు

3 Sep, 2021 11:05 IST|Sakshi

 ఏడాదిన్నర తర్వాత విదేశీ విమానాలకు అనుమతి

చార్టర్డ్‌ ఫ్లైట్‌లవైపే విమానయాన సంస్థల మొగ్గు

టికెట్‌ ధర రూ. 1.35 లక్షలు!

కార్మికుల ఆందోళన 

సాక్షి, బాల్కొండ(నిజామాబాద్‌): కరోనా నేపథ్యంలో ఏడాదిన్నర తరువాత కువైట్‌ ప్రభుత్వం తమ దేశానికి విదేశీ విమానాల రాకపోకలకు అనుమతి ఇవ్వడంతో వివిధ విమానయాన సంస్థలు టికెట్‌ ధరలను పెంచేశాయి. షెడ్యూల్‌ విమానాలను నడపాల్సిన సంస్థలు చార్టర్డ్‌ విమానాలలో ప్రయాణికులను చేరవేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. సాధారణ షెడ్యూల్‌ విమానాలు నడిపితే తమకు గిట్టుబాటు కాదని పలు విమానయాన సంస్థలు చార్టర్డ్‌ విమానాలను నడపడానికే మొగ్గుచూపుతున్నాయి.

భారత్‌నుంచి కువైట్‌కు మామూలుగా షెడ్యూల్‌ విమాన టికెట్‌ ధర రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది. అయితే ప్రస్తుతం చార్టర్డ్‌ విమానాలకు వివిధ విమానయాన సంస్థలు టికెట్‌ ధరను రూ.1.35 లక్షల వరకు నిర్ణయించాయి. దీంతో మన దేశం నుంచి కువైట్‌కు వెళ్లాలనుకునే వలస కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 22 నుంచి మన దేశ విమానాల ల్యాండింగ్‌కు కువైట్‌ అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పటివరకు షెడ్యూల్‌ విమానాలు ప్రారంభం కాలేదు.

చార్టర్డ్‌ విమానాల టికెట్‌ ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో కువైట్‌కు వెళ్లాలనుకుంటున్న వలస కారి్మకులను కొన్ని సంస్థలు అడ్డగోలుగా దోచుకుంటున్నాయనే అరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా కువైట్‌ నుంచి భారత్‌కు సెలవుపై వచ్చిన కారి్మకులకు ఇప్పుడు తిరిగి వెళ్లడానికి అవకాశం లభించింది. కానీ విమాన టికెట్‌ల ధరలు భారీగా పెరగడం వారికి భారంగా మారింది. ఇప్పటికైనా విమానయాన శాఖ జోక్యం చేసుకుని కువైట్‌ విమాన టికెట్ల ధరలు తగ్గించేలా చర్యలు చేపట్టాలని కార్మికులు కోరుతున్నారు.
చదవండి: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్‌

మరిన్ని వార్తలు