భారత్, మాల్దీవుల రక్షణ బంధం

22 Feb, 2021 04:42 IST|Sakshi
ఒప్పందం సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్, మాల్దీవుల రక్షణ మంత్రి మారియా దీదీ

ఇరు దేశాల మధ్య 5 కోట్ల డాలర్ల లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఒప్పందం

మాలే: భారత్, మాల్దీవుల మధ్య రక్షణ బంధం మరింత బలోపేతమైంది. మాల్దీవుల నావికాదళ బలోపేతానికి తాము పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తామని భారత్‌ మరోసారి స్పష్టం చేసింది. రక్షణ రంగంలో ప్రాజెక్టుల కోసం  ఇరు దేశాల మధ్య 5 కోట్ల డాలర్ల లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఒప్పందం కుదిరింది. మాల్దీవుల ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత్‌కు చెందిన ఎక్స్‌పోర్ట్‌ ఇంపోర్ట్‌ బ్యాంకుల మ«ధ్య ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం మాల్దీవులు తమ రక్షణ రంగ అవసరాల కోసం భారత్‌ బ్యాంకు నుంచి నిధుల్ని రుణాలుగా తీసుకుంటాయి. ప్రస్తుతం మాల్దీవుల పర్యటనలో ఉన్న భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, మాల్దీవుల రక్షణ మంత్రి మారియా దీదీ, ఆర్థిక మంత్రి ఇబ్రహీంలతో చర్చించిన తర్వాత ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మాల్దీవుల రక్షణకు కట్టుబడి ఉన్నామని ఎప్పుడైనా ఆ దేశానికి భారత్‌ విశ్వసనీయమైన నేస్తమని జై శంకర్‌ ట్విట్‌ చేశారు. 5 కోట్ల డాలర్ల రుణ ఒప్పందంతో పాలు మాల్దీవుల్లోని తీరప్రాంత రక్షణ, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం జై శంకర్‌ మారియా దీదీలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. 2016లో కుదుర్చుకున్న రక్షణ కార్యాచరణ ప్రణాళిక మేరకు ఈ ఒప్పందాలు కుదిరాయి. మాల్దీవుల్లో రేవులు, డాక్‌యార్డ్‌ల నిర్మాణం, వాటిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, రాడార్‌ సర్వీసులు, ఆ దేశ నావికాదళానికి శిక్షణ వంటి వాటిలో భారత్‌ సహకారం అందించనుంది. 
 

మరిన్ని వార్తలు