ఐక్య రాజ్య సమితికి లక్షా 50 వేల డాలర్లు ప్రకటన

27 Jan, 2021 14:10 IST|Sakshi

న్యూయార్క్‌: ప్రపంచంలో శాంతికాముక దేశం ఏదంటే అందరూ భారత్‌ను చూపిస్తారు. అలాంటి భారతదేశం ఐక్యరాజ్య సమితి ప్రధాన లక్ష్యం శాంతి స్థాపనకు విశేష కృషి చేస్తోంది. ఈ క్రమంలో శాంతి పెంపొందించేందుకు భారతదేశం భారీ సహాయం ప్రకటించింది. ఏకంగా లక్షా 50 వేల డాలర్లు ఆర్థిక సహాయం ఇస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఈ నిధులను ఐక్య రాజ్య సమితికి అందించనున్నట్లు న్యూయార్క్‌లో జరిగిన వర్చువల్‌ సమావేశంలో భారత్‌ తెలిపింది.

ప్రపంచంలో శాంతిని పెంపొందించేందుకు ఐక్య రాజ్య సమితి తీవ్రంగా శ్రమిస్తోంది. దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడితే శాంతి ప్రయత్నాలు చేస్తుంది. దీంతో ఐక్యరాజ్య సమితికి అన్ని దేశాలు నిధులు ఇస్తుంటాయి. ఈ క్రమంలో భారతదేశం లక్షా 50 వేల డాలర్లు ఇస్తున్నట్లు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత బ్రాండ్‌ అంబాసిడర్‌ టి.ఎస్‌.తిరుమూర్తి ప్రకటించారు.

‘‘శాంతి స్థాపనలో మా దేశం ఎప్పుడు ముందుంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో శాంతి స్థాపన కార్యక్రమాలకు మా మద్దతును పెంచుకుంటున్నాం. అందులో భాగంగానే శాంతి స్థాపన నిధికి 2021 సంవత్సరానికి గాను లక్షా 50 వేల డాలర్లు ప్రకటిస్తున్నాం’’ అని న్యూయార్క్‌లో జరిగిన వర్చువల్‌ సమావేశంలో తిరుమూర్తి వెల్లడించారు. ఈ సందర్భంగానే త్రిమూర్తి 2020లో శాంతిస్థాపనకు జరిగిన కార్యక్రమాలను ప్రస్తావించారు. 

ఐక్యరాజ్య సమితి ప్రధాన లక్ష్యం ప్రపంచదేశాల మధ్య శాంతియుత వాతావరణం ఉండాలనేది అందరికీ తెలిసిందే. ప్రధానంగా మూడో ప్రపంచ యుద్ధం అనేది రాకుండా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ప్రపంచ దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఐరాస కృషి చేస్తోంది. ఈ ప్రయత్నంలో భారత్‌ కీలకంగా పని చేస్తుంది. అందుకే భారతదేశానికి ఐరాసలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. ప్రస్తుతం తాత్కాలిక సభ్య దేశంగా భారత్‌ కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు