రాణి ఎలిజబెత్‌-2 అంత్యక్రియలు.. లండన్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

18 Sep, 2022 10:54 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 అధికారిక అంత్యక్రియలు సోమవారం(19వ తేదీన) జరుగనున్నాయి. రాణి మృతదేహాన్ని లండన్‌ వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌లో సోమవారం ఉదయం 6.30 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరరం.. ఉదయం 11 గంటలకు రాణి అధికారిక అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభమవుతుందని  బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

కాగా, ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల అధినేతలు, ప్రధానులు,  ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై ఘన నివాళి అర్పించనున్నారు. ఇందులో భాగంగానే.. భారత ప్రభుత్వం తరఫున  బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఉదయం లండన్‌ చేరుకున్నారు. 

ఇక, రాణి అంత్యక్రియల కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌.. ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రోన్‌, టర్కీ ఎర్డోగన్‌, బ్రెజిల్‌ జైర్‌ బోల్సోనారో, బ్రెగ్జిట్‌ పరిణామంతో సంబంధం లేకుండా యూరోపియన్‌ యూనియన్‌, యూరోపియన్‌ మండలి ప్రతినిధులకు సైతం ఆహ్వానం పంపింది రాజప్రసాదం. వీళ్లతో పాటు 56 దేశాల కామన్‌వెల్త్‌ దేశాల ప్రతినిధులు సైతం హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి మయన్మార్, రష్యా, బెలారస్ దేశాల నేతలు మాత్రం హాజరు కావడం లేదు. వారికి రాజ కుటుంబం ఆహ్వానం పంపించలేదు. 
 

మరిన్ని వార్తలు