యాంటీ టెర్రర్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి పాక్‌ ఊరట.. భారత్‌ స్పందన ఇది

22 Oct, 2022 11:03 IST|Sakshi
పారిస్‌లో జరిగిన ఫాట్ఫ్‌ సమావేశం(ఇన్‌సెట్‌లో బాగ్చీ)

ఉగ్రవాద ఆర్థిక కార్యకలాపాల వ్యతిరేక గ్లోబల్‌ విభాగం ఫాట్ఫ్‌‌‌(FATF.. ఫైనాన్షియల్‌ యాక్షన్ టాస్క్ ఫోర్స్‌) తన ‘గ్రే లిస్ట్‌’ నుంచి పాకిస్థాన్‌ను తొలగించింది. ఫ్రాన్స్‌ పారిస్‌లో జరిగిన రెండు రోజుల సమావేశం అనంతరం.. ఫాఫ్ట్‌ అధ్యక్షుడు రాజ కుమార్‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 

అయితే నాలుగేళ్ల తర్వాత పాక్‌కు దక్కిన ఊరట పరిణామంపై పొరుగు దేశం భారత్‌ స్పందించింది. మనీల్యాండరింగ్‌ అంశంలో ఆసియా ఫసిఫిక్‌ గ్రూప్‌నకు పాక్‌ సహకారం కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు భారత్‌ పేర్కొంది. అంతేకాదు.. ఫాట్ఫ్‌ పరిశీలన ఫలితంతో.. 26/11 ముంబై దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులతో పాటు మరికొందరిపై పాక్‌ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ఒక ప్రకటన విడుదల చేశారు. 

ప్రపంచ ప్రయోజనాల దృష్ట్యా.. పాక్‌ తన ఆధీనంలో ఉన్న భూభాగంలో ఉగ్రవాదం, ఉగ్రవాద ఆర్థిక కార్యాకలాపాలకు వ్యతిరేకరంగా నమ్మకమైన, నిరంతర చర్యలను కొనసాగించాలని.. ఈ విషయాన్ని ప్రపంచానికి స్పష్టంగా తెలియజేయాలని ఆయన ప్రకటనలో కోరారు. 

ఇక.. జూన్ 2018 మరియు జూన్ 2021లో FATF గుర్తించిన వ్యూహాత్మక లోపాలకు సంబంధించి పాక్‌ ఇచ్చిన వివరణ పట్ల ఫాట్ఫ్‌ సంతృప్తి వ్యక్తం చేసింది.  కార్యాచరణ ప్రణాళికల కట్టుబాట్లను నెరవేర్చడానికి సాంకేతిక లోపాలను కారణంగా చూపించింది పాక్‌. ఈ కారణంతో.. పాక్‌కు ఊరట ఇస్తూ ఫాట్ఫ్‌ నిర్ణయం తీసుకుంది. 

 FATF బ్లాక్‌లిస్ట్‌లో ఒక దేశం చేరిందంటే.. ఆ దేశం మనీల్యాండరింగ్‌, టెర్రరిస్ట్‌ ఫైనాన్సింగ్‌లో ప్రపంచ పోరాటానికి సహకారం అందించడం లేదనే అర్థమన్నమాట. 

 ఒకవేళ  ఫాట్ఫ్‌ బ్లాక్‌ లిస్ట్‌లో ఏదైనా దేశానికి స్థానం దక్కితే.. ఆ దేశానికి ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు, ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, యూరోపియన్‌ యూనియన్‌ నుంచి సహకారం అందడం తగ్గిపోతుంది.

 FATF(Financial Action Task Force)లో సభ్య దేశాలు 39. అమెరికా, యూకేతో పాటు భారత్‌ కూడా కూడా సభ్య దేశంగా ఉంది. 

 పాకిస్తాన్‌ను ఫాట్ఫ్‌ గ్రే లిస్ట్‌ నుంచి తొలగించడంపై.. అమెరికా హర్షం వ్యక్తం చేసింది. 

ఇదీ చదవండి: ఉక్రెయిన్‌తో యుద్ధంలో మరణించిన రష్యా సైనికుల సంఖ్య అంతా?

మరిన్ని వార్తలు