UNSC Meeting On Ukraine: రష్యా ‘బుచా’ నరమేధం!.. భారత్‌ స్పందన ఇది

6 Apr, 2022 08:02 IST|Sakshi

ఉక్రెయిన్‌లో రష్యా బలగాల నరమేధంపై భారత్‌ స్పందించింది. బుచా నగరం శవాల దిబ్బగా మారడం, ఉక్రెయిన్‌ సామాన్యులపై రష్యా సైన్యం అకృత్యాలకు పాల్పడిందంటూ కొన్ని ఫొటోలు, వీడియోలు వెలుగులోకి రావడం తెలిసిందే. 

ఈ పరిణామాలను పలుదేశాలు తీవ్రస్థాయిలో ఖండించాయి. రష్యా రాయబారులను తమ తమ దేశాల నుంచి బహిష్కరిస్తున్నట్లు పలు దేశాలు కూడా ప్రకటించాయి. తాజాగా బుచా నగరంలో పౌరులపై జరిగిన దారుణ హత్యాకాండపై భారత్‌ స్పందించింది. ఉక్రెయిన్‌లో పౌరులను నిర్దాక్షిణ్యంగా చంపడం హేయనీయమైన చర్యలని, దీనిపై అంతర్జాతీయ విచారణ జరగాలని.. అదీ స్వతంత్ర్యంగా ఉండాలన్న డిమాండ్‌కు భారత్‌  మద్దతు ఉంటుందని ప్రకటించింది. 

బుచాలో పౌర హత్యల ఇటీవలి నివేదికలు తీవ్రంగా కలచివేశాయి. మేము(భారత్‌) ఈ హత్యలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాము. స్వతంత్ర విచారణకు మద్దతు ఇస్తున్నాం. అదే సమయంలో దౌత్యమే సమస్యకు పరిష్కారమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్‌.తిరుమూర్తి పునరుద్ఘాటించారు. ‘‘అమాయక మానవ జీవితాలు ప్రమాదంలో ఉన్నప్పుడు.. దౌత్యం మాత్రమే అనుకూలమైన మార్గం’’ అంటూ పేర్కొన్నారాయన. 

మరోవైపు 
ఉక్రెయిన్‌ పరిణామాలపై అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌తో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ మంగళవారం ఫోన్‌ చర్చలు జరిపారు. పనిలో పనిగా ద్వైపాక్షిక సంబంధాలూ చర్చకు వచ్చినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు