‘శ్రీలంకకు సపోర్ట్‌ కావాలి.. అనవసర ఒత్తిడి కాదు’.. చైనాకు భారత్‌ చురకలు

28 Aug, 2022 10:19 IST|Sakshi

కొలంబో: శ్రీలంకలోని హంబన్‌టోటా నౌకాశ్రయానికి ఇటీవలే హైటెక్‌ నిఘా నౌకను తీసుకొచ్చింది చైనా. ఈ నౌకను హంబన్‌టోటాలో కొన్ని రోజులు నిలిపి ఉంచటంపై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే.. భారత్‌ ఆందోళనలను తోసిపుచ్చుతూ చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో చైనాకు చురకలు అంటించింది న్యూఢిల్లీ. కొలంబోకు ప్రస్తుతం మద్దతు కావాలని, అనవసరమైన ఒత్తిడి, అనవసర వివాదాలతో ఇతర దేశాల ఎజెండాను రుద్దటం కాదని స్పష్టం చేసింది.

‘చైనా రాయబారి చేసిన వ్యాఖ్యలను పరిశీలించాం. ఆయన ప్రాథమిక దౌత్య మర్యాదలను ఉల్లంఘించడం వ్యక్తిగత లక్షణం కావచ్చు లేదా ఆ దేశ వైఖరిని సూచించొచ్చు. చైనా రాయబారి క్వి జెన్‌హాంగ్ భారతదేశం పట్ల చూపుతున్న దృక్పథం అతని స్వంత దేశం ఎలా ప్రవర్తిస్తుందనే దానిని సూచిస్తోంది. భారత్ అందుకు చాలా భిన్నమని ఆయనకు తెలుపుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీలంకకు మద్దతు అవసరం. కానీ అనవసరమైన ఒత్తిడి, ఇతర దేశాల ఎజెండాను రుద్దేందుకు అవసరం లేని వివాదాలు కాదు.’  అని ట్వీట్‌ చేసింది శ్రీలంకలోని భారత హైకమిషన్‌.

భారత్‌ అభ్యంతరాలపై చైనా రాయబారి గత శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా భద్రతా పరమైన ఆందోళనలను లేవనెత్తటం బయటినుంచి అవరోధం కలిగించటమేనన్నారు. అలాగే.. అది శ్రీలంక సార్వభౌమత్వం, స్వంతంత్రతలో కలుగజేసుకోవటమేనని భారత్‌పై ఆరోపణలు చేశారు. అయితే, నౌకపై శ్రీలంక, చైనాలు ఉమ్మడిగా చర్చించి ఇరు దేశాల ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత‍్వం, స్వతంత్రతను కాపాడుకునేందుకు నిర్ణయించటం సంతోషంగా ఉందన్నారు.

ఇదీ చదవండి: శ్రీలంకను వీడిన చైనా నిఘా నౌక

మరిన్ని వార్తలు