ఇజ్రాయెల్- హమాస్‌ యుద్ధం.. మా మద్దతు వారికే: ప్రధాని మోదీ

10 Oct, 2023 15:52 IST|Sakshi

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంపై భారత్‌ తన వైఖరిని వెల్లడించింది. హమాస్‌ మిలిటెంట్లు, ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న భీకర పోరులో తాము ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలబడుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రస్తుత యుద్ధ పరిస్థితిపై ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజామిన్‌ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడినట్లు పేర్కొన్నారు . భారత్‌ ఉగ్రవాదానికి వ్యతిరేకమని, అదే ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని తెలిపారు.

‘ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడాను. ఇజ్రయెల్‌లో యుద్ధానికి సంబంధించి తాజా పరిణామాలపై ఆయన వివరించారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయ ప్రజలు ఇజ్రాయెల్‌కు అండగా ఉంటారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న దానిని భారత్‌ తీవ్రంగా ఖండిస్తుంది.’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

కాగా ఇంతకముందు కూడా ప్రధానిమోదీ ఇజ్రాయెల్‌ యుద్ధంపై స్పందించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌లో ఉగ్రవాదుల దాడుల వార్తలు విని దిగ్బ్రాంతికి గురైనట్లు తెలిపారు ఈ విపత్కర పరిస్థితుల్లో తాము ఇజ్రాయెల్‌కు అండగా నిలబడతామని పేర్కొన్నారు.
చదవండి: గాజా సరిహద్దుల్లో 1500 హమాస్‌ మిలిటెంట్ల మృతదేహాలు: ఇజ్రాయెల్‌

అదే విధంగా అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాలు కూడా ఇప్పటికే ఇజ్రాయెల్‌కు మద్దతుగా ప్రకటన విడుదల చేశాయి. ఇజ్రాయెల్‌కు సాయం చేసేందుకు అమెరికా స్వయంగా రంగంలోకి దిగింది. ఎయిర్‌క్రాఫ్ట్‌ కేరియర్‌తోపాటు యుద్ధ విమానాలు, నౌకలను మధ్యదరా సముద్రం ద్వారా ఇజ్రాయెల్‌కు పంపింది.

మరోవైపు ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధంలో నెత్తుటేర్లు పారుతున్నాయి. అక్టోబర్‌ 7న పాలస్తీనా మిలిటెంట్లు హమాస్‌ ఇజ్రాయెల్‌పై మొదలెట్టినప్పటి నుంచి ఈ దాడిలో ఇప్పటి వరకు ఇరువర్గాలకు చెందిన 1600 వందల మంది ప్రాణాలు కోల్పోగా 6 వేల మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఒక్క ఇజ్రాయెల్‌లోనే 900 మంది మరణించగా.. 2,600 మంది గాయపడ్డారు. ఇక గాజాలో 704 మంది మృత్యువాతపడగా.. వీరిలో 143 మంది చిన్నారులు, 105 మంది మహిళలు ఉన్నారు. అదే విధంగా మరో 4000 మంది ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలో గాయపడ్డారు.

మరిన్ని వార్తలు