Sri Lanka Economic Crisis: ఎన్నో దేశాలను సాయం అడిగాం.. భారత్ మాత్రమే ఆదుకుంది

17 Jul, 2022 11:42 IST|Sakshi

కొలంబో: చరిత్రలో కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తమకు భారత్ మాత్రమే సాయం అందించిందని చెప్పారు శ్రీలంక మంత్రి కాంచన విజెసేకర. భారత్ ఆహన్నహస్తం గురించి ప్రపంచానికి తెలియజెప్పారు. తీవ్ర ఇంధన కొరతతో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న తాము.. సాయం చేయాలని అన్ని దేశాలను అడిగామని చెప్పారు. కానీ భారత్‌ మాత్రమే రుణ సాయం చేసి ఆదుకుందని శనివారం మీడియాతో మాట్లాడుతూ  వెల్లడించారు.

సాయం కావాలని రష్యాను కూడా అడుగుతున్నట్లు చెప్పారు శ్రీలంక మంత్రి. ఈ విషయంపై రెండు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. తమకు కావాల్సిన సాయం గురించి రష్యాకు వివరించామని, ఆ దేశం ఎలాంటి సాయం అందిస్తుందోనని ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

3.8 బిలియన్ డాలర్ల సాయం
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌, ఆహార పదార్థాలు వంటి నిత్యావసర వస్తువుల కొరతతో దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది శ్రీలంక. వీటిని దిగుమతి చేసుకునేందుకు విదేశీ నిల్వలు లేక దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇలాంటి సంక్షోభ సమయంలో భారత్ అండగా నిలిచింది. 3.8 బిలియన్ డాలర్లు విలువ చేసే సాయం అందించి గొప్ప మనసు చాటుకుంది. 

కరెన్సీ మార్పిడులు, శ్రీలంక చెల్లించాల్సిన రుణాలను వాయిదా వేయడం సహా 1.5 బిలియన్ డాలర్లు విలువ చేసే ఇంధనం, ఔషధాలు,  ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర వస్తువులను పంపింది.

భారత్ పెద్దన్న
శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య భారత్ చేసిన సాయాన్ని కొనియాడాడు. తాము కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఇండియా పెద్దన్నలా సాయం చేస్తోందని చెప్పాడు. భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి రుణపడి ఉంటామన్నాడు. ఈ కష్టాల నుంచి తాము త్వరలోనే బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
చదవండి: ‘కోవిడ్‌ కూడా ముంచింది’

>
మరిన్ని వార్తలు