లింగ సమానత్వంలో అట్టడుగునే భారత్‌.. ఎన్నేళ్లు పడుతుందో తెలుసా?

13 Jul, 2022 17:47 IST|Sakshi

జెనీవా: భారత్‌ శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకెళ్తున్నా లింగ సమానత్వంలో మాత్రం వెకబడిపోయింది. జెనీవాలోని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌) 'వార్షిక లింగ అంతర నివేదిక 2022' ప్రకారం భారత్‌ 135వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఒక స్థానం మెరుగైనా.. ఇంకా అట్టడుగునే కొనసాగుతోంది. ఐలాండ్స్‌ మరోమారు లింగ సమానత్వంలో తన తొలిస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో ఫిన్‌లాండ్‌, నార్వే, న్యూజీలాండ్‌, స్వీడన్‌లు ఉన్నాయి. 

మరో 132 ఏళ్లు.. 
మొత్తం 146 దేశాలకు ర్యాంకులు కేటాయించగా.. భారత్‌ అట్టడుగున 135వ స్థానంలో నిలవటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్‌ కన్నా అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్, ఇరాన్‌, ఛాడ్‌ వంటి 11 దేశాలు మాత్రమే వెనబడి ఉన్నాయి. జీవన వ్యయం పెరిగిపోతుంటటం వల్ల ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషుల మధ్య అంతరం పెరిగిపోతోందని డబ్ల్యూఈఎఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. దాని ప్రకారం భారత్‌లో స్త్రీపురుషులు సమానంగా మారేందుకు మరో 132 ఏళ్లు(2021లోని 136వ ర్యాంకు ప్రకారం) పడుతుందని అంచనా వేసింది. కరోనా మహమ్మారి సైతం లింగ అంతరంలో ఓ తరం వెనక్కు వెళ్లేలా చేసిందని తెలిపింది. 

గడిచిన 16 ఏళ్లలో భారత ర్యాంకు 7 స్థానాలు ఎగబాకినా.. ఇంకా అట్టుడుగునే ఉందని ఆందోళన వ్యక్తం చేసింది డబ్ల్యూఈఎఫ్‌.' భారత్‌లోని సుమారు 662 మిలయన్ల మంది మహిళ జనాభాతో ప్రాంతీయ ర్యాంకులపై ప్రభావం పడుతోంది. 2021తో పోలిస్తే.. ఆర్థిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం, అవకాశాల్లో మెరుగైనప్పటికీ.. కార్మిక శక్తిలో మరింత కిందకు పడిపోయింది. శాసనకర్తలు, ఉన్నతాధికారులు, మేనేజర్స్‌ విభాగాల్లో మహిళలు 14.6 శాతం నుంచి 17.6 శాతానికి చేరుకున్నారు. సాంకేతిక, వృత్తి నిపుణుల్లో మహిళలు 29.2 నుంచి 32.9 శాతానికి చేరారు. వారి ఆదాయం పెరిగింది. అయితే.. మగవారితో పోలిస్తే వారికి అందే గౌరవంలో మాత్రం అంకా వెనకబడే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మగవారి కోసం వారిని తిరస్కరిస్తున్నారు.' అని పేర్కొంది నివేదిక.

ఆ విభాగంలో ఊరట.. 
మహిళల రాజకీయ సాధికారతలో భారత్ 48వ స్థానంలో నిలిచింది. గత యాభై ఏళ్లుగా మహిళలకు రాజకీయాల్లో దక్కుతున్న స్థానం చాలా తక్కువ. దాంతో ఈ ర్యాంకు మరింత పడిపోయినట్లు డబ్ల్యూఈఎఫ్‌ తెలిపింది. మరోవైపు.. ఆరోగ్యం, జీవన విధానంలో భారత్‌ 146వ స్థానానికి పరిమితమైంది. లింగ అంతరం 5 శాతానికిపైగా ఉన్న ఐదు దేశాల్లో ఒకటిగా నిలిచింది. అయితే.. భారత్‌కు ఊరట కలిగించే విషయం ఏంటంటే ప్రాథమిక పాఠశాలల నమోదులో లింగ సమానత్వంలో టాప్‌లో నిలిచింది.

ఇదీ చూడండి: ప్లాస్టిక్‌ను తినేసే 'రోబో ఫిష్‌'.. సముద్రాల స్వచ్ఛతలో కీలక అడుగు!

మరిన్ని వార్తలు