తీస్తా ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం

28 Mar, 2021 04:39 IST|Sakshi
హసీనాకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ సంబంధ బాక్స్‌ను అందజేస్తున్న మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ

బంగ్లాదేశ్‌ ప్రధాని హసీనాతో ద్వైపాక్షిక చర్చలు

రెండు దేశాల మధ్య ఐదు ఎంవోయూలు

ఢాకా: తీస్తా నదీ జలాల పంపకంపై బంగ్లాదేశ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం అమలుకు కట్టుబడి ఉన్నట్లు భారత ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ విషయమై బంగ్లా ప్రధాని హసీనాతో రెండు రోజుల పర్యనటలో భాగంగా మోదీ చర్చలు జరిపారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. విదేశాంగశాఖ కార్యదర్శి హర్షవర్థన్‌ ష్రింగ్లా శనివారం మీడియాకు ఈ విషయం వెల్లడించారు. ఫెని నదీ జలాల పంపిణీ ముసాయిదాను రూపొందించాలని షేక్‌ హసీనాను మోదీ కోరారని ఆయన చెప్పారు.

రెండు దేశాలు 56 నదుల జలాలను పంచుకుంటున్నాయి..మున్ముందూ కూడా ఇదే సహకారం కొనసాగుతుందని ఆయన అన్నారు. తీస్తా సహా నదీ జలాల విభజనపై రెండు దేశాల ఉన్నతాధికారుల మధ్య ఇటీవలే ఢిల్లీలో జరిగిన భేటీ ఫలప్రదంగా ముగిసిందన్నారు. సిక్కింలో ప్రారంభమయ్యే తీస్తా నది పశ్చిమబెంగాల్‌ గుండా ప్రవహించి బంగ్లాదేశ్‌లో ప్రవేశించడానికి ముందు బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. ఈ నదీ జలాల పంపకంపై 2011లో కుదిరిన ఒప్పందం పశ్చిమబెంగాల్‌ సీఎం మమత అభ్యంతరాలతో అమలు కాకుండా నిలిచిపోయింది. బంగ్లాదేశ్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకుని మోదీ శనివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు.

ఇద్దరు ప్రధానుల చర్చలు
బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, భారత ప్రధాని  మోదీ శనివారం ద్వైపాక్షిక సంబంధాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కనెక్టివిటీ, వాణిజ్యం, ఇంధనం, ఆరోగ్య రంగాలపై వారు ప్రధానంగా దృష్టి సారించారు. ఈ సందర్భంగా మోదీ హసీనాకు  12 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులకు సంబంధించిన ఒక బాక్సును బహూకరించారు.

శాంతి, ప్రేమ, సుస్థిరత కోరుకుంటున్నాం
భారత్, బంగ్లాదేశ్‌లు అస్థిరత, అలజడులు, ఉగ్రవాదం బదులు శాంతి, ప్రేమ, సుస్థిరత ఆకాంక్షిస్తున్నాయని ప్రధాని మోదీ ప్రకటించారు. గోపాల్‌గంజ్‌లోని ఒరకండిలో మతువా వర్గం హిందువుల ఆరాధ్యుడు హరిచంద్‌ ఠాకూర్‌ ఆలయాన్ని సందర్శించిన అనంతరం అక్కడి వారితో మాట్లాడారు. భారత్‌ నుంచి ఒరకండికి సులువుగా చేరుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. పశ్చిమబెంగాల్‌లోని అత్యంత కీలకమైన మతువా వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకే ప్రత్యేకంగా మోదీ ఈ పర్యటన చేపట్టారని విశ్లేషకులు అంటున్నారు. 

సరిహద్దులకు సమీపంలో ఉన్న 16వ శతాబ్దం నాటి జెషోరేశ్వరి కాళీ ఆలయాన్ని శనివారం ప్రధాని మోదీ దర్శించుకున్నారు. అమ్మ వారికి వెండితో తయారుచేసిన, బంగారు పూత కలిగిన మకుటాన్ని సమర్పించుకున్నారు. తుంగిపరాలోని షేక్‌ ముజిబుర్‌ రహ్మాన్‌ మాసోలియాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. బంగబంధుకు పుష్పాలతో నివాళులర్పించారు. ముజిబుర్‌ మాసోలియంను సందర్శించిన ఏకైక విదేశీ ప్రభుత్వ నేతగా మోదీ నిలిచారు.

మరిన్ని వార్తలు