అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ అసిస్టెంట్‌ సెక్రటరీగా చౌధరి

17 Mar, 2023 05:23 IST|Sakshi

వాషింగ్టన్‌: భారతీయ అమెరికన్‌ ఫ్లైట్‌ టెస్ట్‌ ఇంజినీర్‌ రవి చౌధరి చరిత్ర సృష్టించారు. అమెరికా రక్షణ శాఖలో ఎయిర్‌ ఫోర్స్‌ అసిస్టెంట్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ స్థాయికి ఎదిగిన మొట్టమొదటి భారతీయ అమెరికన్‌ ఈయనే. రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్‌లోని ఈ అత్యున్నత పదవికి రవి చౌధరిని నామినేట్‌ చేస్తూ అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన సిఫారసును సెనేట్‌ 65–29 ఓట్ల తేడాతో బుధవారం ఆమోదించింది. ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీకి చెందిన డజనుకు పైగా సభ్యులు సైతం రవి చౌధరికి మద్దతివ్వడం విశేషం.

రవి అమెరికా ఎయిర్‌ ఫోర్స్‌లో 1993–2015 నుంచి 22 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేశారు. ఆపరేషనల్, ఇంజినీరింగ్, సీనియర్‌ స్టాఫ్‌ అసైన్‌మెంట్లు వంటి వైవిధ్యమైన అంశాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌లో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు. ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌ఏఏ)లోని అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రామ్స్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ విభాగానికి డైరెక్టర్‌ కూడా వ్యవహరించారు. సి–17 పైలట్‌గా అఫ్గానిస్తాన్, ఇరాక్‌ యుద్ధ విధుల్లో పాలుపంచుకున్నారు. సిస్టమ్స్‌ ఇంజినీర్‌ కూడా అయిన చౌధరి నాసాలోనూ పనిచేశారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు