అమెరికాలో అపీల్స్‌ కోర్టు జడ్జిగా రూపాలీ దేశాయ్‌

7 Aug, 2022 05:00 IST|Sakshi

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన జడ్జి రూపాలీ హెచ్‌.దేశాయ్‌ చరిత్ర సృష్టించారు. అమెరికాలో అత్యంత శక్తిమంతమైన నైన్త్‌ సర్క్యూట్‌ అపీల్స్‌ కోర్ట్‌ జడ్జిగా నియమితురాలయ్యారు. దక్షిణాసియా నుంచి ఈ ఘనత సాధించిన తొలి జడ్జి ఆమే. 44 ఏళ్ల రూపాలీ నియామకానికి సెనేట్‌ 67–29 ఓట్లతో ఆమోదముద్ర వేసింది.

అత్యంత ప్రతిభావంతురాలైన రూపాలీ నామినేషన్‌కు భారీ మద్దతు లభించడం ఆశ్చర్యం కలిగించలేదని సెనేట్‌ జ్యుడీషియరీ కమిటీ చైర్‌పర్సన్‌ డిక్‌ డర్బిన్‌ కొనియాడారు. శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పని చేసే నైన్త్‌ సర్క్యూట్‌ అమెరికాలోని 13 పవర్‌ఫుల్‌ అపీల్‌ కోర్టుల్లో అతి పెద్దది. 9 రాష్ట్రాలు, 2 ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి.

రూపాలీ 1978లో కెనడాలో జన్మించారు. అమెరికాలో న్యాయవాదిగా, న్యాయ నిపుణురాలిగా 16 ఏళ్ల అనుభవం ఆమె సొంతం. అరిజోనా వర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో మాస్టర్స్‌చేశారు. మెరిట్‌ స్టూడెంట్‌గా పేరు తెచ్చుకున్నారు. 2007 నుంచి కాపర్‌స్మిత్‌ బ్రోకెల్‌మన్‌ లా సంస్థలో పార్టనర్‌గా ఉన్నారు. 2021లో కీలకమైన అమెరికన్‌ లా ఇన్‌స్టిట్యూట్‌లో మెంబర్‌గా చేరారు.  గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అరిజోనా రాష్ట్రంలో జో బైడెన్‌ గెలుపును సవాలు చేస్తూ డొనాల్డ్‌ ట్రంప్‌ వేసిన కేసులో ట్రంప్‌కు వ్యతిరేకంగా సమర్థంగా వాదనలు విన్పించి ఆకట్టుకున్నారు.

మరిన్ని వార్తలు