రిచర్డ్‌ వర్మకు కీలక పదవి

1 Apr, 2023 04:02 IST|Sakshi

అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రెటరీగా నియామకం

వాషింగ్టన్‌: అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రెటరీగా భారతీయ అమెరికన్‌ రిచర్డ్‌ వర్మకు కీలక పదవి దక్కింది. శాఖకు సంబంధించిన నిర్వహణ, వనరుల వ్యవహారాలను ఆయన చూసుకుంటారు. దీన్ని అత్యంత శక్తిమంతమైన విదేశాంగ శాఖలో కీలకమైన సీఈఓ స్థాయి పోస్టుగా పరిగణిస్తుంటారు. 54 ఏళ్ల వర్మ నియామకాన్ని సెనేట్‌ 67–26 ఓట్లతో ఆమోదించింది. మాజీ దౌత్యవేత్త అయిన వర్మ ఒబామా హయాంలో విదేశాంగ శాఖ అసిస్టెంట్‌ సెక్రెటరీ (న్యాయ వ్యవహారాలు)గా కూడా పని చేశారు.

2015 నుంచి రెండేళ్లపాటు భారత్‌లో అమెరికా రాయబారిగా ఉన్నారు. వర్మ 1968లో అమెరికాలోని భారతీయ కుటుంబంలో జన్మించారు. అమెరికా వైమానిక దళ స్కాలర్‌షిప్‌తో కాలేజీ చదువు పూర్తి చేశారు. లాహిగ్‌ వర్సిటీ నుంచి బీఎస్, జార్జ్‌టౌన్‌ వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ చేశారు. అనంతరం యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌లో జడ్జ్‌ అడ్వొకేట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

దేశాధ్యక్షుని నిఘా సలహా బోర్డులో, సామూహిక జనహనన ఆయుధాలు, ఉగ్రవాద కమిషన్‌ సభ్యునిగా చేశారు. ప్రస్తుతం మాస్టర్‌కార్డ్‌ చీఫ్‌ లీగల్‌ ఆఫీసర్, గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ హెడ్‌గా ఉన్నారు. ఫోర్డ్‌ ఫౌండేషన్‌తో పాటు మరెన్నో ప్రతిష్టాత్మక బోర్డుల్లో సభ్యునిగా, ట్రస్టీగా కొనసాగుతున్నారు. విదేశాంగ శాఖ నుంచి అత్యుత్తమ సేవా మెడల్, వైమానిక దళం నుంచి మెరిటోరియస్‌ సర్వీస్‌ మెడల్, కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారిన్‌ రిలేషన్స్‌నుంచి ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌ ఫెలోషిప్‌ తదితరాలు దక్కించుకున్నారు. 

మరిన్ని వార్తలు