యూఎన్‌ సర్వసభ్య సమావేశంలో చేదు అనుభవం

26 Sep, 2020 08:48 IST|Sakshi

ఇమ్రాన్‌ స్పీచ్‌ ప్రారంభం కాగానే వాకౌట్‌ చేసిన భారత ప్రతినిధి

జెనీవా: ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు భంగపాటు ఎదురయ్యింది. పాక్‌ ప్రధాని ఉపన్యాసం ప్రారంభం అయిన వెంటనే భారత ప్రతినిధి ఐక్యరాజ్య సమితి  జనరల్‌ అసెంబ్లీ హాల్‌ నుంచి వాకౌట్‌ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. ఇమ్రాన్‌ ఖాన్‌ శుక్రవారం నాటి సర్వసభ్య సమావేశానికి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌, ప్రధాని నరేంద్ర మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడమే కాక కశ్మీర్‌ సమస్యను లేవనెత్తడంతో భారత దౌత్యవేత్త మిజిటో వినిటో వాకౌట్‌ చేశారు. అనంతరం పాక్‌ ప్రధాని వ్యాఖ్యలపై ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి టీఎస్‌ తిరుమూర్తి స్పందించారు. భారత్‌ వ్యతిరేక ప్రకటనకు తగిన సమాధానం చెప్తామన్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌ దౌత్యపరంగా చాలా తక్కువ స్థాయి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఈ మేరకు తిరుమూర్తి ట్వీట్‌ చేశారు. ‘75 వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి చాలా తక్కువ స్థాయి దౌత్యపరమైన ప్రకటన చేశారు. పాకిస్తాన్ తన సొంత మైనారిటీలను హింసించడం గురించి, సరిహద్దు ఉగ్రవాదం గురించి దుర్మార్గపు అబద్ధాలు, వ్యక్తిగత దాడులకు దిగింది. ఇందుకు తగిన సమాధానం ఎదురు చూస్తోంది’ అంటూ ట్వీట్‌ చేశారు. (చదవండి: ‘ఉగ్ర అడ్డాగా సోషల్‌ మీడియా)

అంతకు ముందు విద్వేష ప్రసంగాలు, నకిలీ వార్తలు, వీడియోల ద్వారా ఉగ్రవాదులు సోషల్‌ మీడియాలో​ దుష్ర్పచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) 45వ సమావేశాల్లో భారత్‌ పేర్కొంది. ఇంటర్‌నెట్‌, సోషల్‌ మీడియాలో నకిలీ కంటెంట్‌ పెరిగిపోవడం పట్ల ఐక్యరాజ్యసమితిలో భారత్‌ శాశ్వత మిషన్‌ కార్యదర్శి పవన్‌ బాధే ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు అమాయక ప్రజలు, యువతను తమ శ్రేణుల్లో నియమించుకునే ఉద్దేశంతో ఈ ప్రచారం సాగిస్తున్నారని అన్నారు. భద్రతా దళాలు, ఆరోగ్య కార్యకర్తలపై దాడులకు ఉగ్రవాదులు వీరిని ఉసిగొల్పుతున్నారని మండిపడిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు