యూఎస్‌ ఘర్షణ.. కలకలం రేపుతున్న త్రివర్ణ పతాకం

10 Jan, 2021 10:33 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనాన్ని ముట్టడించిన సమయంలో ప్రవాస భారతీయుడు త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో ప్రకంపనలు రేపుతున్నాయి. కేరళ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ విన్సెంట్‌ జావియర్‌ పాలతింగాల్‌ (54) ట్రంప్‌ మద్దతుదారులతో కలిసి మన జాతీయ జెండాని ప్రదర్శించాల్సిన అవసరమేమొచ్చిందని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కానీ విన్సెంట్‌ మాత్రం తన చర్యని పూర్తిగా సమర్థించుకుంటున్నారు. పలు మీడియా సంస్థలు ఫోన్‌ ద్వారా ఆయనని ఇంటర్వ్యూ చేసిన సమయంలో అడిగిన ప్రశ్నలకు అత్యంత నిర్లక్ష్యంగా సమాధానాలిచ్చారు. (యూఎస్‌లో హింసాత్మకం: ట్రంప్‌ తీరుపై ఆగ్రహం)

అందరూ భావిస్తున్న ట్టుగా ట్రంప్‌ మద్దతుదారులందరూ మూర్ఖులు కాదని నిరూపిం చడానికే తాను జెండా పట్టుకొని వెళ్లానని అంటున్నారు. ‘సాధారణంగా ఎవరైనా నిరసన ప్రదర్శనలకి వెళితే తమ జాతీయ జెండానే మోసుకెళ్తారు. ట్రంప్‌కి ఇప్పటికీ అంతర్జాతీయంగా మద్దతు ఉంది. ఎందరో భారతీయులు ఆయన అభిమానులుగా ఉన్నారు’’ అని విన్సెంట్‌ చెప్పారు. ట్రంప్‌ మద్దతుదారులు అందరూ శాంతియుతంగానే నిరసన ప్రదర్శన నిర్వహించారని, కానీ ఆయన ప్రతిష్టని దిగజార్చడానికి 50 మంది వరకు లెఫ్టిస్టులు నిరసన కారుల్లో కలిసిపోయి బీభత్స కాండ సృష్టించారని ఆరోపించారని విన్సెంట్‌ అడ్డగోలు వాదనలు చేశారు.

వామపక్షాలంటే ద్వేషం : విన్సెంట్‌ స్నేహితులు
విన్సెంట్‌ జేవియర్‌ భారత్‌లో ఉండగా కొన్నాళ్లు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తగా ఉన్నారని ఆయన స్పేహితులు చెప్పారు. లెఫ్ట్‌ పార్టీల పట్ల తీవ్ర ద్వేషభావం ఉండేది. రాజకీయ కారణాలతోనే ఆయన దేశం విడిచి అమెరికా వెళ్లిపోయారని, సాఫ్ట్‌వేర్‌ సంస్థని నెలకొల్పి ఆ దేశంలోనే స్థిరపడిపోయారని విన్సెంట్‌ స్నేహితులు వివరించారు. అమెరికా వెళ్లాక కూడా ఆయన కొన్ని మళయాళీ సంస్థల్లో చురుగ్గా ఉంటూ ట్రంప్‌ మద్దతుదారుడిగా ఉన్నారు. మువ్వన్నెల జెండా పట్టుకొని నిరసనకు వెళ్లడంతో భారతీయుల ఆగ్రహం చవిచూడాల్సి వచ్చింది. దీంతో ఆయన తన ఫేస్‌బుక్‌ ఖాతాలో జెండా పట్టుకొని ఉన్న ఫోటోలను తొలగించారు.  

మరిన్ని వార్తలు