Russia Ukraine War: ఉక్రెయిన్‌లో పాకిస్తాన్‌ విద్యార్థులను కాపాడిన భారత జెండా!

3 Mar, 2022 21:02 IST|Sakshi

భారత జాతీయ పతాకం పాకిస్థాన్ పౌరులకు అండగా నిలిచింది. కల్లోలిత ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా బయటపడేందుకు బాసట అయ్యింది. కొందరు టర్కీ విద్యార్థులు కూడా త్రివర్ణ పతాకం సాయంతోనే ఉక్రెయిన్ సరిహద్దులు దాటగలిగారు. ఆపరేషన్ గంగలో భాగంగా భారత్ చేరుకున్న విద్యార్థులు ఈ విషయాన్ని వెల్లడించారు. రష్యా దాడులతో కల్లోలంగా మారిన ఉక్రెయిన్ నుంచి బయటపడేందుకు వేలమంది ప్రయత్నిస్తున్నారు. భారత్ మినహా మరే దేశమూ తమ పౌరులను స్వదేశానికి తరలించేందుకు ముందుకు రావడం లేదు.

దీంతో ఇతర దేశస్థులు కూడా మన జెండానే నమ్ముకుంటున్నారు. పాకిస్థాన్, టర్కీకి చెందిన కొందరు విద్యార్థులు భారత్‌ జెండాను ప్రదర్శించడం ద్వారా.. ఉక్రెయిన్ సరిహద్దులను సురక్షితంగా దాటగలిగారు. ఉక్రెయిన్‌లోని భారతీయులను తరలించేందుకు ఆపరేషన్ గంగ పేరుతో కేంద్రం ప్రత్యేక విమానాలు నడుపుతోంది. వాయుసేన రవాణా విమానాలతోపాటు ఎయిరిండియా, స్పైస్‌జెట్, ఇండిగో సంస్థలు విమానాలు నడుపుతున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యేక విమానం అందుకునేందుకు రొమేనియాలోని బుచారెస్ట్‌కు కొందరు భారత విద్యార్థులు చేరుకున్నారు.

భారత జెండాలను పట్టుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనను వారు పాటించారు. మన జెండాను చూపించి ఉక్రెయిన్ సరిహద్దును దాటడం తమకు సులువైందని విద్యార్థులు పేర్కొన్నారు. అయితే, తమను చూసిన కొందరు పాకిస్థాన్, టర్కీ విద్యార్థులు కూడా భారత జాతీయ జెండాను చేతబూని సరిహద్దులను దాటారని వివరించాడు. ఆపరేషన్ గంగలో భాగంగా బుధవారం 4 ఎయిర్‌ఫోర్స్‌ విమానాల్లో  మొత్తం 798మంది విద్యార్థులు భారత్ చేరుకున్నారు. గురువారం బుకారెస్ట్‌ నుంచి 8, బుడపెస్ట్ నుంచి 5, జెస్‌జోవ్ నుంచి 3, సుసీవా నుంచి 2, కోసిస్‌ నుంచి ఒక విమానం ఢిల్లీకి చేరుకున్నాయి. వీటిలో మొత్తం 3726మంది భారతీయ విద్యార్థులు. పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది.
 

మరిన్ని వార్తలు