లక్ష గ్రీన్‌కార్డులు వృథా అయ్యే ప్రమాదం!

7 Aug, 2021 06:25 IST|Sakshi

వాషింగ్టన్‌: దాదాపు లక్షకు పైగా గ్రీన్‌కార్డులు ఈ సంవత్సరం వృథా అయ్యే ప్రమాదం ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే అమెరికాలో శాశ్వత నివాసం ఉండాలనుకునే భారతీయ ఐటీ నిపుణుల్లో చాలామంది ఆశలపై నీళ్లు జల్లినట్లు కానుంది. ఈ ఏడాది ఎంప్లాయ్‌మెంట్‌ ఆధారిత గ్రీన్‌ కార్డుల కోటా గతేడాదితో పోలిస్తే లక్షకు పైగా పెరిగి 2,61,500కు చేరిందని భారత్‌కు చెందిన సందీప్‌ పవార్‌ చెప్పారు. అయితే చట్టం ప్రకారం సెప్టెంబర్‌ 30లోపు అవసరమైన వీసాలు జారీ కాకుంటే అధికంగా పెరిగిన కోటాలోని లక్ష కార్డులు వృ«థా అవుతాయన్నారు. ఈ విషయమై బైడెన్‌ ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై ఇంకా ప్రభుత్వ వర్గాలు స్పందించలేదు.

యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) చేస్తున్న జాప్యమే గ్రీన్‌కార్డుల వృ«థాకు కారణమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు భారత్, చైనాకు చెందిన 125 మంది ఈ వృ«థా నివారించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఒకపక్క దశాబ్దాలుగా గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసేవారుండగా, మరోపక్క ఇలా కార్డులు వృ«థా కావడం సబబుకాదని వీరు కోర్టుకు విన్నవించారు. యూఎస్‌సీఐఎస్‌ అనుసరిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల పలువురు భారతీయుల భాగస్వాములు, పిల్లలు, తల్లిదండ్రులకు గ్రీన్‌కార్డులందడంలేదని భారతీయ హక్కుల పోరాట కార్యకర్త పవార్‌ చెప్పారు. డ్రీమర్ల హక్కులకు రక్షణ కల్పించాలని, గ్రీన్‌ కార్డులపై పరిమితి ఎత్తివేయాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు