అదృశ్యమైన భారతీయ పర్వతారోహకుడి ఆచూకీ లభ్యం.. పరిస్థితి విషమం!

20 Apr, 2023 13:10 IST|Sakshi

నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వతారోహణకు వెళ్లి అదృశ్యమైన భారతీయ పర్వతారోహకుడు అనురాగ్ మాలు ఆచూకీ లభ్యమైంది. కనిపించకుండా పోయిన మూడు రోజుల అనంతరం ప్రాణాలతో కనుగొన్నారు. అనురాగ్‌ మాలును సజీవంగా గుర్తించామని అతని సోదరుడు సుధీర్‌ తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని, మణిపాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. 

కాగా రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్‌కు చెందిన చెందిన 34 ఏళ్ల అనురాగ్‌ మాల్‌ గత వారం కొంత మంది ప‌ర్వ‌తారోహ‌కుల‌తో క‌లిసి నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వతం అధిరోహించడానికి వెళ్లాడు. అయితే ఎప్రిల్‌ 17న క్యాంప్‌ నుంచి దిగుతుండగా  6,00 మీటర్ల ఎత్తులో నుంచి కిందపడిపోయాడు. అప్పటి నుంచి అతని కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోందని సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ చైర్మన్ మింగ్మా షెర్పా తెలిపారు. ఈ క్రమంలో తాజాగా అతన్ని సజీవంగా గుర్తించారు.

ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ గురించి అవగాహన కల్పించడానికి ప్రపంచ వ్యాప్తంగా 8 వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న 14 శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ఉన్నారు. కాగా అనురాగ్ రెక్స్‌ కరమ్‌ వీర్‌ చక్ర అవార్డును పొందటమే కాకుండా భారత్‌ నుంచి 2041 అంటార్కిటిక్ యూత్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. ఇక అన్నపూర్ణ ప్రపంచంలోని పదవ ఎత్తైన పర్వతం. ఇది సముద్ర మట్టానికి 8,091 మీటర్ల ఎత్తులో ఉంది.ఈ పర్వతం ప్రమాదాలకి ప్రసిద్ధి చెందింది.

మరిన్ని వార్తలు