వీడియో: త్రివర్ణ పతాకంపై ఖలీస్తానీ మద్ధతుదారుల దుశ్చర్య.. భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

20 Mar, 2023 14:14 IST|Sakshi

లండన్‌లోని భారత హైకమిషనర్‌ వద్ద ఆదివారం జరిగిన పరిణామాలకు భారత్‌ తక్షణ కౌంటర్‌ ఇచ్చింది. పంజాబ్‌లో ఖలీస్తానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్ట్‌కు నిరసనగా.. లండన్‌ హైకమిషనర్‌ ఆవరణలో భారత జాతీయ జెండాను ఖలీస్తానీ మద్దతుదారులు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో భారత త్రివర్ణ పతాకాన్ని కిందకు లాగేయాలని యత్నించడం.. ఆ వెంటనే అధికారులు స్పందించడం, తదనంతరం భారీ జాతీయ జెండాను ఎగరేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

లండన్‌ అల్డివిచ్‌ ఇండియా హౌజ్‌ బయట ఈ భారీ భారతీయ జాతీయ జెండాను ఎగరేయగా.. పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రతినిధి జైవీర్‌ షెర్గిల్‌ ఈ పరిణామంపై ఝండా ఊంచా రహే హమారా అంటూ ట్విటర్‌లో పోస్ట్‌ ఉంచారు. భారత జెండాను అవమానించేలా వ్యవహరించిన వాళ్లపై యూకే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. జాతి సంరక్షణకు, పలు రకాల సేవలు అందించిన ఖ్యాతి పంజాబ్‌కు, పంజాబీలకు ఉందని పేర్కొన్నారు ఆయన.

ఇదిలా ఉంటే.. జాతీయ జెండాను కిందకు లాగేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అదే సమయంలో భారత హైకమిషనర్‌ అధికారులు తక్షణం స్పందించారు.  కౌంటర్‌గా ఖలీస్తానీ జెండాను విసిరేయడంపై.. పలువురు నెటిజన్స్‌ ప్రశసంలు గుప్పిస్తున్నారు. 

ఇక ఈ పరిణామంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆదివారం అర్ధరాత్రి భారత్‌లోని బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ క్రిస్టియానా స్కాట్‌కు ఈ ఘటనపై వివరణ కోరుతూ సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. మరోవైపు యూకే మంత్రి తారీఖ్‌ అహ్మద్‌ ఈ ఘటనను ఖండిస్తూ ఓ ట్వీట్‌ చేశారు. 

ఇదీ చదవండి: ఒకేసారి.. 36 మంది భక్తుల గోల్డ్ చైన్లు మాయం

మరిన్ని వార్తలు